‘కరువు జిల్లా సర్వతోముఖాభివృద్ధి’

8 Jul, 2018 09:26 IST|Sakshi
ఐటీ పార్క్‌ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్‌

పాలమూరుపై సీఎం సీఆర్‌కు ప్రత్యేక అభిమానం

ఐటీ పార్కు నిర్మాణం..జిల్లా చరిత్రలో లిఖించదగిన రోజు  

ఐటీ సెజ్‌తో ప్రత్యక్షంగా 15వేలు,పరోక్షంగా 15వేల మందికి ఉపాధి  

పాలమూరులోని 14 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి  

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రికె.తారకరామారావు  

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  దేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతంగా ముద్రబడిన పాలమూరు ప్రాంతం సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. గతంలో ఎన్నడూలేని విధంగా తమ హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. మంత్రి కేటీఆర్‌ మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలం దివిటిపల్లి వద్ద ఐటీ అండ్‌ మల్టీపర్పస్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు శనివారం శంకుస్థాపన చేశారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో రూ.60 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి.. పెద్దచెరువు వద్ద నెక్లెస్‌రోడ్డు నిర్మాణానికి మరో రూ.24 కోట్లు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఐటీ పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేటీఆర్‌ మాట్లాడారు. ఐటీ పార్కు ఏర్పాటు పాలమూరు చరిత్రలో లిఖించదగిన రోజని పేర్కొన్నారు. ఐటీ పార్కు వల్ల ప్రత్యక్షంగా 15వేల మందికి పరోక్షంగా మరో 15వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటీ టవర్‌ నిర్మాణం కోసం వెంటనే రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే అభివృద్ధి నిరోధకంగా మారిన కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేలా పాలమూరు ప్రజలు తమ పౌరుషాన్ని చూపించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో పాలమూరులోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేలా చూడాలని కోరారు.   

రూ.74కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన
పాలమూరు:  మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శని వారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మూడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలో రూ.30 కోట్లతో 41వార్డుల్లో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలకు సంబంధించి 215పనులను ఆర్‌అండ్‌బీ చౌర స్తాలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పట్టణం లో వివిధ చౌరస్తాల్లో రూ.30కోట్లతో చేపట్టనున్న నూతన నిర్మాణాలను క్లాక్‌టవర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్థానికంగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

ఆ తర్వాత పెద్ద చెరువును మంత్రి కేటీఆర్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వరరెడ్డి, గువ్వల బాలరాజు, కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్‌ పెద్ద చెరువులో బోట్‌ షికారు చేశారు. పెద్ద చెరువు చుట్టూ నెక్లెస్‌ రోడ్డు నిర్మాణంపై ఆరాతీసిన మంత్రి పనులకు రూ.24కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

భారీ బందోబస్తు  
జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యాన భారీ బందో బస్తు నిర్వహించారు. అర్‌అండ్‌బీ అతిథిగృహం చౌరస్తా, క్లాక్‌టవర్, పెద్ద చెరువు ప్రాంతాల్లో ప్రత్యే క పోలీస్‌ బలగాలను మోహరించారు. పట్టణ డీఎస్పీ భాస్కర్‌ ఆధ్వర్యంలో ఎక్కడా ఇబ్బంది ఎదురుకాకుండా పర్యవేక్షించారు. కాగా, మంత్రి కేటీఆర్‌కు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆఫ్‌ తెలంగాణ ఎంప్లాయీస్‌ టీచర్స్, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. 30శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించి, తెలంగాణ మొదటి పీఆర్‌సీ జూలై నుంచి అమలుచేయాలని కోరారు. సీపీఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ స్కీంను పునరుద్దరించడానికి అసెంబ్లీలో తీర్మా నించి కేంద్రానికి పంపాలని, జిల్లాలో వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారావు, టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి  పాల్గొన్నారు.

వైఎస్సార్‌ చౌరస్తాలో జంక్షన్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు కేటీఆర్,లక్ష్మారెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్‌

  

మరిన్ని వార్తలు