కరోనా కష్టాలు తీరేలా కొత్త విధానం

7 May, 2020 01:58 IST|Sakshi

ఫార్మా రంగం అభివృద్ధిపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మా రంగానికి భారత్‌ను మరింత ఆకర్షవంతమైన పెట్టుబడి గమ్యస్థానంగా మార్చేందుకు కొత్త ఫార్మాస్యూటికల్‌ విధానం తీసుకురావాలని రాష్ట్ర, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఫార్మా ఎగుమతులను పెంచేందుకు కొత్త ఎగుమతుల విధానం ప్రవేశపెట్టాలన్నారు. ఈ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడకు కేటీఆర్‌ బుధ వారం లేఖ రాశారు. దేశంలో ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టాల్సిన చర్యలను లేఖలో ప్రస్తావించారు. అవి ఇలా..  

► భారతదేశ ఫార్మా రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) అత్యంత కీలకం. రూ.10 కోట్లతో పెట్టుబడితో ఏర్పాటయ్యే ఫార్మా పరిశ్రమను ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈగా గుర్తిస్తున్నారు. దీనికి బదులుగా ఇకపై రూ.250 కోట్ల వార్షిక టర్నోవర్‌ ఉన్న కంపెనీలను ఎంఎస్‌ఎంఈలుగా గుర్తించి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 

► అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తయార య్యే ఫార్మా ఉత్పత్తుల్లో నాణ్యత తక్కువగా ఉంటుందనే ప్రచారంతో దేశీయ ఫార్మా రంగం కొన్ని అవకాశాలను కోల్పోతోంది. దీనిని అధిగమించేందుకు లక్షిత దేశాలతో చర్చించడంతో పాటు, భారతీయ ఫార్మా రంగ ఉత్పత్తుల నాణ్యత పెంచేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి. ఫార్మా రంగం అభివృద్ధికి అవసరమైన వాతావరణం, అభివృద్ధి, అనుమతులకు సంబంధించి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు అవసరం. 

► కోవిడ్‌ సంక్షోభ సమయంలో ప్రపంచానికి అవసరమైన మందులను దేశీయ ఫార్మా రంగం సరఫరా చేస్తుండగా, తెలంగాణ భారతదేశంలో ఫార్మా హబ్‌గా కొనసాగుతోంది. తెలంగాణలో సుమారు 800 లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు ఉండగా, జీడీపీలో 35 శాతం వాటాను కలిగి ఉంది. లైఫ్‌సైన్సెస్‌ రంగం తెలంగాణలో 1.20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది.  

► లాక్‌డౌన్‌తో ఉత్పాదన సామర్థ్యం తగ్గడం, కార్మికుల కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఫార్మాస్యూటికల్‌ రంగం లో 80% పరిశ్రమలు ఎంఎస్‌ఎంఈలు కావడంతో ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. ప్రస్తుతం ఫార్మా కంపెనీలు ముడి సరుకుల ధరలు పెరగడం, ఇతర ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వీటికి ఆదాయ పన్ను, జీఎస్టీ రిఫండ్‌ను వెంటనే ఇవ్వడంతో పాటు పన్నుల వసూలుపై ఆరు నెలలు మారటోరియం విధించాలి.  

► కేంద్రం పరిధిలోని ఎగుమతుల ప్రోత్సా హక పథకాల నిబంధనలు సరళతరం చేయడంతో పాటు, పెండింగులో ఉన్న ప్రోత్సాహకాలను విడుదల చేయాలి. చైనా వంటి దేశాల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు భారతీయ ఫార్మా కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. తక్కువ వడ్డీ రేట్లపై ఫార్మా కంపెనీలకు రుణాలు, అత్యవసరం కాని ఔషధాల రేట్లను నిర్ధారించడంలో పది శాతం ఉదారంగా వ్యవహరించడం వంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు. ఇతర దేశాల నుంచి ముడి సరుకులు దిగుమతులు చేసుకునే కంపెనీలకు నౌకాశ్రయాల్లో సత్వర అనుమతులు, ఫార్మా రంగంలో సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) పెంచేందుకు ఆర్థిక రంగ నిపుణులతో కమిటీ ఏర్పాటు వంటి విషయాలను కేటీఆర్‌ సూచించారు. 

► ఫార్మా రంగానికి అవసరమైన ముడి పదార్థాలు (ఏపీఐ)కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు భారత్‌లో ఉత్పాదన ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌ ఫార్మా సిటీకి పెట్టుబడులు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి.

మరిన్ని వార్తలు