చిన్ననాటి ఐస్‌ గోలా తాతకు కేటీఆర్‌ భరోసా

14 Feb, 2019 20:50 IST|Sakshi
తన చిన్నతనంలో ఐస్‌ గోలా అమ్మిన సయ్యద్‌ అలీతో కేటీఆర్‌

తన స్కూల్‌ ముందు ఐస్‌ గోలా అమ్మిన వ్యక్తితో ఆత్మీయ ముచ్చట్లు

సయ్యద్‌ అలీకి ఇల్లు, వృద్ధాప్య పెన్షన్‌ ఇప్పిస్తానని హామీ

సాక్షి, హైదరాబాద్‌ : సాక్షి, హైదరాబాద్‌: ముప్పై ఏళ్ల క్రితం అబిడ్స్‌లోని గ్రామర్‌ స్కూల్లో చదువుకునేటప్పుడు స్కూలు ముందు ఐస్‌ గోలా అమ్మిన సయ్యద్‌ అలీని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు గురువారం కలిశారు. సయ్యద్‌ అలీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేశారు. ‘ఇంకా ఐస్‌ గోలా అమ్ముతున్నావా? కుటుంబం పరిస్థితి ఎలా ఉంది, పిల్లలు ఏం చేస్తున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది’అని కేటీఆర్‌ వాకబు చేశారు. ‘ఆరోగ్యం అంతగా సహకరించడం లేదు.

గత ఏడాది మేలో గుండె శస్త్ర చికిత్స జరిగింది. పొట్ట గడవడంకోసం ఇంకా ఆ స్కూల్‌ వద్దే ఐస్‌ గోలాలు అమ్ముతున్నాను’అని సయ్యద్‌ అలీ బదులిచ్చాడు. సయ్యద్‌ అలీకి నిలువ నీడ కూడా లేదని మాటల్లో తెలుసుకున్న కేటీఆర్‌ వెంటనే స్పందించారు. ‘మీకు వెంటనే ఒక ఇల్లు మంజూరు చేస్తాను. నెలవారీ వృద్ధాప్య పెన్షన్‌ మంజూరు చేయిస్తాను. మీ కుమారులకు సరైన ఉపాధి చూపిస్తాను’అని కేటీఆర్‌ మాట ఇచ్చారు. సయ్యద్‌అలీకి ఇచ్చిన హామీల అమలుకోసం వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. కేటీఆర్‌ గురించి చాలా విన్నానని, నిజంగా ఇలా కలుస్తానని తానెప్పుడూ అనుకోలేదని ఈ సందర్భంగా సయ్యద్‌ అలీ ఆనందం వ్యక్తం చేశారు.

తన కష్టాలను విన్న వెంటనే స్పందించి ఆదుకోవడానికి ముందుకు వచ్చిన కేటీఆర్‌కు సయ్యద్‌అలీ ధన్యవాదాలు తెలిపారు. మహబూబ్‌అలీ అనే యువకుడు రెండు వారాల క్రితం కేటీఆర్‌కు ఒక ట్వీట్‌ చేశాడు. ‘‘కేటీఆర్‌ సాబ్‌... మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీకు ఐస్‌గోలా అమ్మిన వ్యక్తి (చావూష్‌) మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు’ అని ఆ ట్వీట్‌లో పేర్కొ న్నాడు. కేటీఆర్‌ వెంటనే స్పందించి ‘తప్పకుండా కలుస్తాను. చావూష్‌ గురించి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి’అని బదులిచ్చాడు. బేగంపేటలోని తన క్యాంపు కార్యాలయానికి గురువారం రావాలని సయ్యద్‌అలీని కోరాడు. సయ్యద్‌అలీని కలిసిన సమయంలో కేటీఆర్‌ చిన్ననాటి జ్ఞాపకాలతో ఉద్వేగానికి లోనయ్యారు.


ట్విట్టర్‌లో కేటీఆర్‌ స్పందన

మరిన్ని వార్తలు