భవన నిర్మాణ కార్మికుల బాధ్యత నిర్మాణ సంస్థలదే

27 Mar, 2020 00:54 IST|Sakshi

ఆపత్కాలంలో కార్మికులకు అండగా నిలవాలని పిలుపు

భవన నిర్మాణ యాజమాన్య సంస్థలతో కేటీఆర్‌ భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థల యాజమాన్యాలపై ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కార్మికుల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని, వారి సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని నిర్మాణ సంస్థలను కోరారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై గురువారం బిల్డర్స్‌ అసోసియేషన్‌తో ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగం గణనీయంగా అభివృద్ధి చెందడంతో భవన నిర్మాణదారులకు కూడా అభివృద్ధి ఫలాలు అందాయన్నారు. లక్షలాది మంది భవన నిర్మాణరంగ కార్మికులు దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం రాష్ట్రానికి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడకుండా బిల్డర్లు తోడ్పాటు అందించాలన్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న చోట కార్మికుల బాగోగులు, వారి అవసరాలు, సమస్యలపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో వారి పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ దేవేందర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు నిత్యావసరాలు, భోజన సదుపాయం కల్పించేందుకు వీలుగా భవన నిర్మాణ సంస్థల యాజమాన్యాలకు అనుమతులు ఇవ్వాలని డీజీపీతో పాటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లకు ఫోన్‌లో ఆదేశించారు. కార్మికులకు కనీస వసతులు కల్పించడంలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెల్‌ సమన్వయంతో పని చేయాలన్నారు.

సంక్షేమాన్ని అశ్రద్ధ చేస్తే కఠిన చర్యలు: కాంట్రాక్టు, రోజు వారీ కూలీలకు వేతనాలు, కూలీ డబ్బుల చెల్లింపులో నిబంధనలు అతిక్రమించే వారిపై కఠి నంగా వ్యవహరిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. రూ.కోటి చొప్పున విరాళం అందజేసిన క్రెడాయ్, మీనాక్షి గ్రూప్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, డైరెక్టర్‌ విçశ్వజిత్, వివిధ భవన నిర్మాణ యాజమాన్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అత్యవసర సేవల కింద ఔషధాల తయారీ 
కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఔషధ తయారీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సేవల కింద పరిగణిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఫార్మా కంపెనీలకు లాకౌ ట్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. వివిధ ఔషధ తయారీ, బల్క్‌ డ్రగ్‌ తయారీ పరిశ్రమల యాజమాన్యాలతో గురువారం ఆయన ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయా సంస్థల ప్రస్తుత ఔషధ తయారీ సామర్థ్యంపై ఆరా తీయడంతో పాటు, అవసరమైన మందులను పూర్తిస్థాయి సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలని సూచించారు.

కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ఫార్మా రంగం పో షిస్తున్న పాత్రను అభినందించారు. అత్యవసరం కాని ఔషధాల ఉత్పత్తిని తగ్గించడంతో పాటు, కరోనా నియంత్రణలో ఉపయోగించే మందుల ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాలని కోరారు. సోడియం హైపో క్లోరేట్, బ్లీచింగ్‌ పౌడర్, హ్యాం డ్‌ శానిటైజర్లకు ప్రస్తుతం ఎక్కువ డిమాండ్‌ ఉందని చెప్పారు. సామాజిక బాధ్యత సీఎస్‌ఆర్‌లో భాగంగా ఫార్మా కంపెనీలు వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేయాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఫార్మా సంస్థల కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా