‘బయ్యారం’పై కేంద్రం సానుకూలం

24 Nov, 2017 01:42 IST|Sakshi

ఢిల్లీలో మీడియాతో మంత్రి కేటీఆర్‌

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేందర్‌సింగ్‌తో భేటీ

స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై త్వరలో టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి కేటీఆర్‌ గురువారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. గతంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యమేనన్న ధృక్పథంతో ఉందన్నారు. దీనిపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ రాష్ట్ర అధికారులతో చర్చించి నెల రోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు.

బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌తోపాటు ఏపీలోని కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేందర్‌సింగ్‌ చౌదరీ గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావుతో కలసి మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర అధికారులు కూడా పూర్తి వివరాలతో నివేదికను తయారు చేయాలని కేంద్ర మంత్రి సూచించినట్లు చెప్పారు.

వచ్చే నెల 8న కేంద్ర మంత్రి రాష్ట్రంలో పర్యటించనున్నారని, అప్పుడు ప్లాంట్‌ ఏర్పాటుపై కీలక ప్రకటన చేస్తారని తెలిపారు. కేంద్ర మంత్రి బీరేందర్‌సింగ్‌ మాట్లాడుతూ ప్లాంట్ల ఏర్పాటుపై గతంలో అధ్యయనం జరిపిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిందన్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొన్ని వివరాలను తెప్పించుకున్నామని, వాటిని అధ్యయనం చేశాక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నెల రోజుల్లో మళ్లీ ప్లాంట్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపి నివేదిక ఇస్తుందన్నారు.


తెలంగాణలో పట్టణాభివృద్ధి చర్యలు భేష్‌...
కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ కితాబు
కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరితో సమావేశమైన కేటీఆర్‌.. ఈ నెల్లో ప్రారంభం కానున్న హైదరాబాద్‌ మెట్రోపై వివరాలందించా రు. తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన, బహిరంగ మలవిసర్జన రహిత మున్సిపాలిటీలుగా మార్చేందుకు తీసు కుంటున్న చర్యలతోపాటు తాగునీరు, వ్యర్థాల నిర్వహణకు అవలంబిస్తున్న  విధానాల గురించి ఆయనకు వివరించారు. పట్టణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా అభినందించినట్లు కేటీఆర్‌ మీడియాకు తెలిపారు. ఈ చర్యల గురించి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు.


గల్ఫ్‌లోని తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చండి
గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ ప్రజల సమస్యలను తీర్చాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. గురువారం సుష్మతో సమావేశమైన కేటీఆర్‌ ఈ అంశాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా 2006లో యూఏఈలో జైలుపాలైన సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆరుగురు కార్మికులను విడిపించాల్సిందిగా కోరారు. వారి క్షమాభిక్ష పిటిషన్లను కొట్టేశారని, అందువల్ల వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సుష్మ సానుకూలంగా స్పందించినట్లు కేటీఆర్‌ మీడియాకు తెలిపారు. త్వరలో ప్రధానితో కలసి అబుధాబి పర్యటనకు వెళ్తున్నానని, అప్పుడు అక్కడి అధికారులతో మాట్లాడి బాధితుల విడుదలకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారన్నారు.

మరిన్ని వార్తలు