ఫార్మాసిటీ ఆవశ్యకత  మరింత పెరిగింది

3 Jul, 2020 02:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో హైదరాబాద్‌ ఫార్మాసిటీ ప్రాధాన్యం, అవసరం మరింతగా పెరిగిందని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. లైఫ్‌ సైన్సెస్, ఫార్మా రంగ పరిశ్రమలకు ఇప్పటికే దేశ రాజధానిగా హైదరాబాద్‌ ఖ్యాతి గడించిందని, ఫార్మాసిటీ ద్వారా ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి కరోనాకి అవసరమైన మందుతో పాటు వ్యాక్సిన్‌ తయారీకి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు, వ్యాధులకు ఫార్మాసిటీ పరిష్కారం చూపుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ.. యూఎస్‌ఎఫ్డీఏ నుంచి వరుసగా అత్యధిక అనుమతులు పొందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని గుర్తు చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా ఏర్పడబోతున్న హైదరాబాద్‌ ఫార్మాసిటీ జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా ఉంటుందన్నారు. ఫార్మాసిటీ ప్రాజెక్టు పురోగతిపై గురువారం మంత్రి కేటీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫార్మాసిటీకి రూపకల్పన చేస్తున్నామన్నారు. కొన్ని నెలల్లో ఫార్మాసిటీ తొలి దశ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు మంత్రికి వివరించారు. రోడ్లు, ఇతర మౌలికవసతుల పనులు జరుగుతున్న తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు.

రాబోయే ఏడాదికాలం నుంచి ఐదేళ్ల పాటు ఎప్పుడెప్పుడు ఏయే పనులు చేపడతారు, ఎలాంటి పురోగతి ఫార్మాసిటీ సాధించబోతున్నదో తెలిపేలా నిర్దిష్ట కాలావధితో నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఔషధ ఉత్పత్తుల కంపెనీలు మొదలుకొని అందులో పనిచేసే కార్మికులకు అవసరమైన నివాస సౌకర్యాల వరకు అన్ని ఒకేచోట ఉండే విధంగా స్వయంసమృద్ధి కలిగిన టౌన్‌షిప్‌గా ఉండాలన్న బృహత్తర లక్ష్యంతో ముందుకు పోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీలో కేవలం ఉత్పత్తుల తయారీ మాత్రమే కాకుండా... ఫార్మా పరిశోధన, లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి ప్రత్యేకించి ఒక యూనివర్సిటీ, సాధ్యమైనంత ఎక్కువగా గ్రీన్‌ కవర్‌ వంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయన్నారు.     

మరిన్ని వార్తలు