హాజీపూర్‌ ఘటనపై స్పందించిన కేటీఆర్‌

20 May, 2019 03:56 IST|Sakshi

బొమ్మలరామారం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌ హత్యల ఘటనపై టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. బొమ్మలరామారం మండలంలోని మల్యాల గ్రామ సర్పంచ్‌ బిట్టు శ్రీనివాస్‌ హాజీపూర్‌లో జరిగిన బాలికల హత్యలు, బాధిత కుటుంబాలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీనికి ట్విటర్‌లో స్పందించిన కేటీఆర్‌.. శనివారం బిట్టు శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడా రు. ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్నామన్నా రు. సీఎం కేసీఆర్‌ సైతం హాజీపూర్‌ ఘటనపై సీరియస్‌గా ఉన్నారని తెలిపారు.

చట్ట పరిధిలో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠినమైన శిక్ష పడేందుకు చర్యలు తీసుకుంటా మని పేర్కొన్నారు. త్వరలోనే బాధితులను కలుస్తామని, ప్రజలందరూ దయచేసి సంయమనం పాటించాలని కోరారు. హాజీపూర్‌ సంఘటనపై ప్రతి ఒక్కరికీ బాధగా ఉందని, రాజకీయాలు వద్దని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతతో మాట్లాడి బాధితులను కలవాల్సిందిగా సూచిస్తామన్నారు. స్థానిక ఎస్‌ఐ, సీఐల నిర్లక్ష్యం వల్లే సమస్య జఠిలంగా మారిందని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌తో మాట్లాడుతామన్నారు. తాను ఫోన్‌ చేసి మాట్లాడిన విషయాన్ని బాధితులకు, గ్రామస్తులకు తెలియజేయాలని సర్పంచ్‌ బిట్టు శ్రీనివాస్‌కు కేటీఆర్‌ సూచించారు.  

మరిన్ని వార్తలు