స్ట్రాటజీ గ్రూప్‌ను ఏర్పాటు చేయండి

29 Apr, 2020 01:54 IST|Sakshi
కేంద్ర ఐటీ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ సూచన 

చైనా నుంచి వెనక్కి మళ్లే కంపెనీలను రప్పించాలి

భారత్‌ నెట్‌ ప్రాజెక్టుకు సహకారం అందించండి 

రాష్ట్రానికి మరో 2 ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లు ఇవ్వాలని వినతి  

రాష్ట్రాల ఐటీ మంత్రులతో కేంద్ర ఐటీ మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు చెందిన పరిశ్రమలను చైనా నుంచి భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కే.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా దేశంలో పెద్దెత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కరోనా నేపథ్యంలో జపాన్‌ లాంటి దేశాలు తమ కంపెనీలను చైనా నుంచి ఇతర దేశాలకు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వస్తున్న ప్రకటనలను ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులతో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత సంక్షోభంలోనూ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయని, అందుకు అనుగుణంగా కేంద్రం సహకరించాలని సూచించారు. 

స్ట్రాటజీ గ్రూప్‌ను ఏర్పాటు చేయండి... 
కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత వ్యాపార, వాణిజ్య రంగాల నిర్వహణకు సంబంధించి పలు దేశాలు పారిశ్రామికవేత్తలు, మేధావులతో స్ట్రాటజీ గ్రూప్‌లను (వ్యూహ బృందాలు) ఏర్పాటు చేసిన విషయాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు. దేశంలోనూ ఐటీ పరిశ్రమకు సంబంధించి స్ట్రాటజీ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పిస్తున్నందున, సమీప భవిష్యత్తులోనూ ఇది కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఇంటర్నెట్‌ వినియోగం పెరిగినందున బ్రాడ్‌ బ్యాండ్, నెట్‌వర్క్‌ల బలోపేతానికి కేంద్రం చొరవ తీసుకోవాలన్నారు. భారత్‌ నెట్‌ ప్రాజెక్టుకు అవసరమైన సహకారం అందించాలని కేటీఆర్‌ కేంద్రాన్ని కోరారు. 

మరో రెండు ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్లు... 
రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మరో రెండింటిని మంజూరు చేయాలని కేటీఆర్‌ కోరారు. ప్రస్తుతం బయోటెక్నాలజీ, మెడికల్‌ డివైజెస్, ఫార్మా వంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉత్పన్నం అవుతున్నట్లు చెప్పారు. ఈ రంగాల్లో ఐటీ ఆధారిత అవకాశాలు లేదా అయా రంగాల సమ్మిళితం ద్వారా వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కామర్స్‌ రంగం మరింత విస్తరించే అవకాశం ఉన్నందున ప్రోత్సాహం అందించాలన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అనుబంధ రంగాల్లోని ఎంఎస్‌ఎంఈలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున జీఎస్టీ, ఆదాయ పన్ను తదితరాల్లో మినహాయింపులు ఇవ్వాలన్నారు. అమెరికా, యూరప్‌ ఆర్థిక వ్యవస్థలు భారతీయ ఐటీ, అనుబంధ రంగాలపై ప్రభావం చూపే పక్షంలో, అందులోని మానవ వనరులను ఇతర రంగాలకు తరలించేలా ప్రణాళికలు అవసరమని కేటీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మూడు రోజుల్లో ప్రత్యేక పోర్టల్‌
కరోనా వైరస్‌ కట్టడి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆదర్శవంతమైన పద్ధతులు, కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మిగిలినవారు ఉపయోగించుకోవడానికి వీలుగా ఒక ప్రత్యేక పోర్టల్‌ను మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ హామీ ఇచ్చారు. ఈ కామర్స్‌ రంగానికి చేయూతను అందిస్తామన్నారు.

మరిన్ని వార్తలు