కేటీఆర్‌ ఇన్‌ రూబిక్స్‌ క్యూబ్‌ 

24 Jul, 2019 02:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా రూబిక్స్‌ క్యూబ్‌లతో ఆయన చిత్రపటాన్ని రూపొందించారు. బుధవారం కేటీఆర్‌ పుట్టిన రోజు కావడంతో కూకట్‌పల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ యువ నాయకుడు పాటిమీది జగన్మోహన్‌రావు కార్యాలయంలో 2,100 రూబిక్స్‌ క్యూబ్‌లతో ఈ చిత్రపటాన్ని (పోర్ట్‌ట్రెయిట్‌) రూపొందించారు. ఇలా రూబిక్స్‌ క్యూబ్‌లతో చిత్రపటం రూపొందించడం మనదేశంలో తొలిసారని, కేటీఆర్‌కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపాలన్న ఆలోచనతో తన మేనల్లుడు కౌశిక్, అతని మిత్రుడు శరణ్‌గుప్తా అనే 9వ తరగతి విద్యార్థులు రెండు రోజులు శ్రమించి ఈ చిత్రపటాన్ని రూపొందించినట్లు జగన్మోహన్‌ రావు తెలిపారు.

నేడు కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు
టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేయనున్నారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ విద్యార్థివిభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి.

కేటీఆర్‌కు వరల్డ్‌ వాటర్‌ కాంగ్రెస్‌  ఆహ్వానం 
వచ్చే ఏడాది మేలో అమెరికాలోని నెవెడాలో జరగనున్న వరల్డ్‌ ఎన్విరాన్మెంటల్, వాటర్‌ కాంగ్రెస్‌ సదస్సుకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కి ఆహ్వానం అందింది. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ సంస్థ నిర్వహించే ఈ సదస్సుకు రెండోసారి కేటీఆర్‌కి ఆహ్వానం లభించింది. 2017లో కాలిఫోర్నియా శాక్రమెంటోలో జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీనోట్‌ అడ్రస్‌ ఇచ్చారు. 2017లో కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల గురించి కేటీఆర్‌ తన ప్రసంగంలో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సాగు నీరు, పర్యావరణ సమతుల్యత, నీటి వనరుల అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలను గురించి తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభమైన విషయాన్ని తెలుసుకున్నట్టు కేటీఆర్‌కి పంపిన ఆహ్వానంలో నిర్వాహకులు పేర్కొన్నారు. ఈసారి కూడా కీనోట్‌ స్పీకర్‌గా హాజరై తెలంగాణ సాగునీటి అనుభవాలను వివరించాలని కోరారు. 2020 మే 17 నుంచి 21 వరకు అమెరికాలోని నెవెడాలో  ఈ సదస్సు జరుగనుంది. వివిధ దేశాల్లోని సాగునీటి వ్యవస్థలు, స్మార్ట్‌ వాటర్‌ కార్యక్రమాల గురించి చర్చించనున్నట్టు పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు