ఆ 3 రంగాలే కీలకం: కేటీఆర్‌

18 Dec, 2019 02:58 IST|Sakshi

ఉపాధి కల్పన లక్ష్యంగా టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్స్‌ తయారీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలపై దృష్టి

టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఇప్పటికే 11,569 కంపెనీల రాక,

13 లక్షల మందికి ఉద్యోగాలు

పెట్టుబడులు లక్ష్యంగా ప్రత్యేక వ్యూహం అమలుకు కేటీఆర్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్స్‌ తయారీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో పారిశ్రామిక పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్, ఇతర ప్రభుత్వ పాలసీల మూలంగా గత ఐదేళ్లలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఇప్పటివరకు 11,569 కంపెనీలకు అనుమతులు ఇవ్వగా, ఇందులో 80 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. తద్వారా సుమారు 13 లక్షల మందికి ఉపాధి లభించిందని కేటీఆర్‌ వెల్లడించారు.  

ఆ మూడు రంగాలకు ప్రాధాన్యత 
రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమకు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని టెక్స్‌టైల్‌ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్‌ వెల్లడించారు. దేశంలోనే అతిపెద్దదైన వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో కొరియా దిగ్గజ కంపెనీ యంగ్వాన్‌ భారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నదన్నా రు. మరోవైపు ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో కూడా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయని, ఇటీవల బెంగళూరులో ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగం ప్రతినిధులతో నిర్వహించిన భేటీ తరహాలో వివిధ నగరాల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. వన్‌ప్లస్, స్కైవర్త్‌ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ముందుకు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టు పనుల పూర్తి, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యత తదితరాల నేపథ్యంలో వ్యవసాయ దిగుబడులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రైతులకు భరోసా దక్కడంతో పాటు, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్‌ అన్నారు. 

పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక వ్యూహం 
టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్స్‌ తయారీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకు ఆయా రంగాలకు చెందిన కంపెనీలతో ప్రత్యేకంగా చర్చిస్తామని కేటీఆర్‌ వెల్ల డించారు.ఈ మూడు రంగాల్లో పెట్టుబడులతో దేశం లోకి కొత్తగా వచ్చే అంతర్జాతీయ కంపెనీలు, తమ కార్యకలాపాల విస్తరణకు సిద్ధంగా ఉన్న దేశీయ కంపెనీలు లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహం అమలు చేయా లని అధికారులకు సూచించారు. ఈ 3 రంగాల పరిశ్రమల కోసం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ల్యాండ్‌ బ్యాంక్, ఇండస్ట్రియల్‌ పార్కుల సమగ్ర సమాచారాన్ని పెట్టుబడులతో వచ్చే వారి కోసం సిద్ధం చేయాలన్నారు. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యంగా పనిచేయడంతో పాటు, రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కంపెనీలకు ‘టాస్క్‌’తరహా సంస్థలతో శిక్షణ ఇవ్వాలని కేటీఆర్‌ ఆదేశించారు. సమావేశంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా