ఆరోగ్య తెలంగాణ లక్ష్యం 

14 Aug, 2019 01:07 IST|Sakshi

అందరి హెల్త్‌ ప్రొఫైల్స్‌ తయారు చేస్తున్నాం 

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెల్లడి

సిరిసిల్ల: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హైదరాబాద్‌కు చెందిన ఎల్వీ ప్రసాద్‌ వైద్యవిజ్ఞాన సంస్థ సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్న కంటి ఆస్పత్రి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కంటి సమస్యల పరిష్కారానికి కంటి వెలుగు పథకాన్ని కేసీఆర్‌ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం లో కంటి సమస్యలు లేకుండా చేస్తామని వివరించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి ఆరోగ్య స్థితిగతులను సేకరించి హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేస్తున్నామని వివరించారు. ఆరోగ్య తెలంగాణను సాధించేందుకు కేసీఆర్‌ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.   

ప్రైవేటు సంస్థలూ ముందుకు రావాలి.. 
సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, మనిషికి ప్రపంచాన్ని చూపించేవి కళ్లని, అలాంటి కంటి వైద్యంలో ఎల్వీ ప్రసాద్‌ కంటి వైద్యశాల పేదల సేవలో ముందుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న సేవలకు తోడుగా ప్రైవేటు సంస్థలు కూడా పేదల సేవకు ముందుకు వస్తే బాగుంటుందన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌)లో భాగంగా ఎల్వీ ప్రసాద్‌ కంటి వైద్యశాల, హెటెరో వంటి సంస్థలు సిరిసిల్లలో పేదలకు సేవలందించేందుకు ముందుకు రావడం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. హెటెరో ఫౌండేషన్‌ సిరిసిల్లలో రూ.5 కోట్లతో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కంటి ఆస్పత్రి భవనాన్ని నిర్మిస్తుందని వివరించారు.

వీరి స్ఫూర్తితో మరిన్ని సంస్థలు పేదల వర్గాలకు సేవలందించేందుకు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్వీ ప్రసాద్‌ సంస్థ వైస్‌చైర్మన్‌ ఆత్మకూరి రామన్‌ మాట్లాడుతూ.. 32 ఏళ్లుగా ఎల్వీ ప్రసాద్‌ కంటి వైద్యశాల 2.80 కోట్ల మంది పేదలకు వైద్య సేవ లు అందించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కంటి వైద్యసేవల్లో ఎల్వీ ప్రసాద్‌ సంస్థ ముందుందని పేర్కొన్నారు. హెటెరో సంస్థ ప్రతినిధి రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మా సంస్థ సంపద సృష్టించి పది మందికి పంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని తెలిపారు. భవన నిర్మాణానికి రూ.50 లక్షల చెక్కును కేటీఆర్‌కు అందించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా