చెత్తతో 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి : కేటీఆర్‌

1 Jun, 2018 15:05 IST|Sakshi
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. 2022 వరకు నగరాన్ని ప్లాస్టిక్‌ రహిత నగరంగా మార్చడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్‌ వాహన పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. చెత్త ఉత్పత్తి 4800 టన్నులకు పెరిగిందన్న మంత్రి.. చెత్తతో 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ సిబ్బందికి 10 ఎలక్ట్రిక్‌ వాహనాలు అందించారు. అదేవిధంగా చెత్త తరలింపుకోసం 100 ఎలక్ట్రానిక్‌ స్వచ్చ్‌ ఆటో టిప్పర్‌లను ఆయన ప్రారంభించారు.

జూలై చివరి నాటికి ఎల్బీనగర్‌ మెట్రో అందుబాటులోకి..
హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని 20 చెరువులను అభివృద్ధి చేయనున్నామని కేటీఆర్‌ తెలిపారు. జూలై చివరి నాటికి ఎల్బీనగర్‌ మార్గంలో మెట్రో రైలును అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. బహుముఖ వ్యూహాలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఏరిక్‌ సోలీహిమ్‌ కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు