డిండి ప్రాజెక్టుకు చంద్రబాబు అడ్డు

24 Oct, 2018 12:45 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

ఇబ్రహీంపట్నంరూరల్‌: శివన్నగూడ–డిండి ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకోవడానికి కుట్ర చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌  ముఖ్యకార్యకర్తల సమావేశం మంగళవారం బొంగుళూర్‌ సమీపంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో 85వేల ఎకరాలకు సాగునీరందించాలని, శివన్నగూడ ప్రాజెక్టు ద్వారా ఇబ్రహీంపట్నం ప్రజలకు 5 టీఎంసీల నీరందించి రైతుల కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటానని కిషన్‌రెడ్డి చెప్పారని అన్నారు. శ్రీశైలం జలాలతో డిండిని నింపి శివన్నగూడ నుంచి ఇబ్రహీంపట్నంకు నీరు తీసుకురావాడానికి రూ.2,200 కోట్లు వెచ్చించామన్నారు.

పనులు జరుగుతుంటే ఏపీ సీఎం అడ్డుకుంటున్నారని, ఏకంగా 30 సార్లు ముఖ్య మంత్రి హోదాలో కేంద్ర జలవనరుల శాఖకు లేఖలు రాశారని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తిచేసి ఇబ్రహీంపట్నంకు నీరందిస్తామని చెప్పారు. ఈ కుట్రలను వివరించాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు నాలుగు లక్షలు అంతకంటే ఎక్కువగా భర్తీ చేసే ఆవకాశం లేదన్నారు. మిగతావి యువకు స్వయం ఉపాధి, ప్రైవేటు పెట్టుబడులు ద్వారా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. మీ ప్రాంతంలోని ఫార్మాసీటి ప్రపంచంలోనే పెద్దదన్నారు. రామచంద్రపురం, జీడిమెట్ల, బాలానగర్‌ ప్రాంతాల్లో మాదిరిగా కాలుష్యం వెదజల్లకుండా  అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా నెలకొల్పేలా చూడాలని కేసీఆర్‌ చెప్పారన్నారు.

భూములు కోల్పోయిన రైతులకు ఉపాధి కల్పిస్తామన్నారు. కాంగ్రెస్‌ వాళ్ల దుష్ప్రచారం వల్ల గందరగోళం చేశారన్నారు. కాలుష్యంపై మన ముఖ్యమంత్రి కఠినంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌లోని మీ ప్రాంత పెద్దమనిషి కోదండరెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు పక్కనే 330 కిలోమీటర్ల పరిధిలో రూ.16వేల కోట్లతో మెరుగైన స్థాయిలో రీజినల్‌ రింగ్‌రోడ్డు రాబోతుందని, రీజినల్‌కు, ఔటర్‌కి మధ్యలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఉండబోతుందని చెప్పారు. భూముల అమ్ముకోవద్దన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కిషన్‌రెడ్డి ఎమ్మెల్యే కంటే పెద్దగా అవుతాడని కేటీఆర్‌ చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సభ నిర్వహించిన ఇబ్రహీంపట్నం ప్రజలు కిషన్‌రెడ్డి గెలుపుకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రలు సీఎం కేసీఆర్‌ను ఏమీ చేయలేవన్నారు. ఎంపీ నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సంస్థలు రావడం కేటీఆర్‌ చోరవేనన్నారు. రాచకొండ లిప్టు ఇరిగేషన్‌ పూర్తి కేసీఆర్‌తోనే సాధ్యమని అన్నారు.
 
సేవకుడిగా పనిచేస్తా   
మరో సారి ప్రజలు ఆశీర్వదిస్తే సేవకుడిగా పనిచేస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఈ సందర్భంగా సీని నటుడు శివారెడ్డి చేసిన మిమిక్రీ అందరినీ ఆకట్టుకుంది. ఈ సభలో కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్, రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ వంగేటి లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, హయత్‌నగర్‌ జడ్‌పీటీసీ సభ్యుడు నర్సింహ, యాచారం జడ్‌పీటీసీ రమేష్, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ చైర్మన్‌ భరత్‌కుమార్, పెద్దంబర్‌పేట్‌ చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి, నోముల కృష్ణగౌడ్, పాశం రవీందర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, జగదీష్, జేపీ శ్రీనివాస్, డబ్బికార్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అసమ్మతి నేతల గైరాజరు  
ఇబ్రహీంపట్నం: బొంగ్లూర్‌ వద్ద నిర్వహించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి అసమ్మతి నేతలు గైర్హాజరయ్యారు. తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఇసి శేఖర్‌గౌడ్, ఎంపీపీ మర్రి నిరంజన్‌రెడ్డిలు సమావేశానికి రాకపోవడం చర్చనీ యాంశమైంది.    

మరిన్ని వార్తలు