ఖాయిలాపడ్డ పరిశ్రమల్లో ఐటీ సంస్థలు 

16 Mar, 2020 03:27 IST|Sakshi

తూర్పు హైదరాబాద్‌కూ ఐటీని విస్తరిస్తాం: మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం పశ్చిమ హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ పరిశ్రమలను తూర్పు హైదరాబాద్‌లో కూడా విస్తరించే ప్రణాళికలున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మల్లాపూర్, నాచారం పారిశ్రామికవాడల్లో మూతపడ్డ పరిశ్రమలను ఐటీ సంస్థలుగా మార్చేందుకు నిర్ణయించామని, దీనికి సంబంధించి త్వరలో శుభవార్త వెల్లడిస్తామన్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంతో పాటు జనగామ, హుజురాబాద్‌ లాంటి చిన్న పట్టణాల్లో కూడా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సోమవారం అసెంబ్లీలో పద్దులపై చర్చకు ఆయన ఆదివారం రాత్రి సమాధానమిచ్చారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ పెరుగుదల రేటు 16.89 శాతంగా ఉందని, ఇది జాతీయ వృద్ధి రేటు కంటే ఎక్కువ అని పేర్కొన్నారు. ఐటీ రంగంలో ఆఫీస్‌ స్పేస్‌ విషయంలో బెంగళూరును కూడా ఇటీవల వెనక్కి నెట్టామన్నారు. వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో ప్రఖ్యాత బహుళజాతి సంస్థ యంగ్‌వన్‌ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడికి సిద్ధమైందన్నారు.

పౌరులకు అనుగుణంగా.. 
రాష్ట్రంలో పట్టణ జనాభా 44 శాతానికి చేరుకోవటంతో పౌరులకు అనుగుణంగా పురపాలక విధానం రూపొందించినట్లు కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలోని 141 పట్టణాల్లో ప్రజలకు మెరుగైన జీవనప్రమాణాలు ఉండేలా 42 అంశాలతో చెక్‌లిస్టు ఏర్పాటు చేసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో ఔటర్‌ రింగురోడ్డు వరకు హైదరాబాద్‌ అభివృద్ధి లక్ష్యంగా రూ.50 వేల కోట్లతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అందులో రూ.10 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించామన్నారు. టీఎస్‌ఐపాస్‌ను ఆదర్శంగా తీసుకోవాలని నీతి ఆయోగ్‌ ఇతర రాష్ట్రాలకు సూచించడం గౌరవంగా ఉందన్నారు.

ఇప్పుడు టీఎస్‌బీపాస్‌ను ఏప్రిల్‌ 2న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ వరకు ప్రత్యేకంగా మురుగు నీటిపారుదల కోసం మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధుల్లో కూడా జవాబుదారీతనం రావాలని, దాని ఆధారంగా ఎవరినైనా పదవీచ్యుతులను చేయాల్సి వస్తే టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో ప్రారంభిస్తామని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పర్యావరణ సమతౌల్యం దెబ్బతినకుండా చూడాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో జనసంఖ్య పెరుగుతున్నందున, భారం తగ్గించేందుకు సమీకృత టౌన్‌షిప్స్‌ కోసం ముసాయిదా సిద్ధమైందని వివరించారు. పట్టణ ప్రగతి కోసం రూ.148 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ఇతర పార్టీలు సహకరిస్తున్నాయి..
పారిశ్రామికాభివృద్ధి విషయంలో ఇతర రాజకీయ పార్టీలు సహకరిస్తున్నాయని, ఈ తరహా రాజకీయ స్థిరత్వం ఏ రాష్ట్రంలో కూడా లేదని మంత్రి చెప్పారు. ఫార్మా సిటీ లో వచ్చే పరిశ్రమలు ఏరకమైన కాలుష్యాన్ని వెదజల్లవని చెప్పారు. దేశంలో ఉ త్పత్తయ్యే మందుల్లో 40 శాతం వరకు మన వద్దే తయారవుతున్నాయని, ప్రపంచానికి మూ డో వంతు వ్యాక్సిన్‌ మనమే సరఫరా చేస్తున్నామని వివరించారు. ఫార్మాసిటీలో స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలొచ్చేలా చూస్తామని, అయితే స్థానికులకు ఉద్యోగాలంటే కొన్ని సంస్థలు వెనక్కి మళ్లే ప్రమాదం ఉందని, దీనిపై కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇసుక ద్వారా మైనింగ్‌ విభాగానికి గతేడాది రూ.3 వేల కోట్ల ఆదాయం సమకూరిందన్నారు.

కాగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఫార్మాసిటీ ఏర్పాటుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ.. గతంలో ఫార్మా కంపెనీల వల్ల ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందని, దీంతో కాలుష్యం తలెత్తే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో ఫా ర్మా సిటీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని, కాలుష్యం ఉంటే ఏర్పాటుచేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అందరితో చర్చించాకే అంతర్జాతీయ ప్రమాణాలతో కా లుష్యరహితంగానే ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని, అందులో రాజీ పడేది లేదని కేటీఆర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు