భవిష్యత్తులోనూ ఐటీ వృద్ధి: కేటీఆర్‌

26 May, 2020 04:46 IST|Sakshi
మంత్రి కేటీఆర్‌ను కలిసిన హైసియా కొత్త కార్యవర్గం

సాక్షి, హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులోనూ వృద్ధిరేటును కొనసాగిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. కరోనా సంక్షోభం అన్ని రంగాలపై కొంత మేర ప్రభావం చూపిందని, హైదరాబాద్‌కు అనుకూలతల నేపథ్యంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ తిరిగి పురోగమిస్తుందని కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) కొత్త కార్యవర్గం కొత్త అధ్యక్షుడు భరణి కుమార్‌ ఆరోల్‌ నేతృత్వంలో సోమవారం మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో భేటీ అయింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ‘హైసియా’ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తూ వారి సలహా సూచనల్ని సానుకూల దృక్పథంతో స్వీకరిస్తోంది.

హైసియాతో రాబోయే రోజుల్లోనూ కలిసి పనిచేస్తాం, కొత్త అవకాశాలను సృష్టించే దిశగా ‘హైసియా’ కృషి చేయాలి. కరోనాతో పాటు ఇత ర సామాజిక సమస్యలను ఎదుర్కొనేందుకు టెక్నాలజీ సాయం తో ఐటీ కంపెనీలు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలు కొత్త పరిష్కారాలతో ముందుకు వస్తున్నాయి. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మద్దతు ఇస్తాం. ఇటీవల ‘విహజ్‌’ స్టార్టప్‌ రూపొందించి న ఆన్‌లైన్‌ మీటింగ్‌ సొల్యూషన్‌ను ఐటీ శాఖలో అంతర్గత సమావేశాలకు వాడుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మెడికల్, ఎడ్యుకేషన్‌ రంగాల్లో ఐటీ సంస్థలకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఐటీ  అభివృద్ధికి హైసియా తోడ్పడాలి’ అని కేటీఆర్‌ కోరారు.

సహకారం అందిస్తాం : హైసియా
జాతీయ సగటును మించి తెలంగాణ రాష్ట్రం ఐటీ ఎగుమతుల్లో వృద్ధిరేటును సాధించడంపై ‘హైసియా’ కొత్త కార్యవర్గం మంత్రి కేటీఆర్‌ను అభినందించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్లే ఆరేళ్లుగా తెలంగాణ ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతోందన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు పూర్తి సహకారం అందిస్తామని ‘హైసియా’ కార్యవర్గం హామీ ఇచ్చింది. ప్రస్తు త పరిస్థితుల్లో ఐటి ఉద్యోగులకు ఎదురవుతున్న పరిమితులు, ప్రభుత్వం మరియు ఇతర అధికార వర్గాల నుంచి కావాల్సిన సహాయ సహకారానికి సంబంధించి ‘హైసియా’ ప్రతినిధులు పలు సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు