‘జేఎన్‌టీయూ–హైటెక్‌సిటీ.. ట్రామ్‌ లేదా బీఆర్‌టీఎస్‌ ఏర్పాటు’

12 Mar, 2020 03:16 IST|Sakshi

దీనిపై త్వరలోనే స్పష్టతనిస్తాం: మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లి జేఎన్‌టీయూ నుంచి హైటెక్‌సిటీ వరకు ఎలివేటెడ్‌ పద్ధతిలో బీఆర్‌టీఎస్‌ కారిడార్‌ గాని ట్రామ్‌ ట్రాన్స్‌పోర్టు విధానాన్ని కాని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన శాసనసభకు తెలిపారు. జేఎన్‌టీయూ నుంచి హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో కారిడార్‌ నిర్మించాలని, తీవ్ర రద్దీ పెరిగిన సుచిత్ర కూడలి నుంచి కూడా ఈ తరహా ఏర్పాటు అవసరమని, కానీ అక్కడ మెట్రో నిర్మాణానికి వీలుగా స్థలం లేనందున కనీసం ఎంఎంటీఎస్‌నైనా ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ సభ్యుడు వివేకానంద కోరారు. జేఎన్‌టీయూ నుంచి హైటెక్‌సిటీ వైపు రద్దీ తీవ్రంగా ఉన్నందున అక్కడ ప్రత్యేక వ్యవస్థ అవసరమని, అయితే ట్రామ్‌ మార్గాన్ని గాని ఎలివేటెడ్‌ కారిడార్‌ ద్వారా బీఆర్‌టీఎస్‌ విధానాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

మెట్రో రైళ్లలో పాస్‌ను ప్రవేశపెట్టే అంశం కూడా పరిశీలనలో ఉందని, ప్రయాణికుల డిమాండ్‌ దృష్ట్యా రాత్రివేళ వాటి సమయాన్ని పొడిగించే యోచనలో ఉన్నామన్నారు. ప్రస్తుతం 20 వేల ద్విచక్రవాహనాలు, 400 కార్లు నిలిపేందుకు వీలుగా వివిధ ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ సౌకర్యం కల్పించామని, త్వరలో 20 ప్రాంతాల్లో మల్టీలెవల్‌ పార్కింగ్‌ టవర్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయం రూ.14,500 కోట్లు కాగా, వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌గా 10 శాతం మొత్తాన్ని కేంద్రప్రభుత్వం భరించిందని, అందులోనూ ఇంకా రూ.2 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఎంజీబీఎస్‌ నుంచి 5 కి.మీ. దూరంలో ఉన్న ఫలక్‌నుమా వరకు వీలైనంత త్వరలో మెట్రో రైలు కారిడార్‌ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు