చికిత్సలపై పరిశోధనలకు ప్రపంచస్థాయి కేంద్రం

18 Feb, 2020 04:38 IST|Sakshi
సోమవారం పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ కార్ల్‌ జూన్‌కు బయో ఆసియా జినోమ్‌ వ్యాలీ ఆఫ్‌ ఎక్సలెన్సీ అవార్డును అందిస్తున్న మంత్రి కేటీఆర్‌ 

ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: మంత్రి కేటీఆర్‌

సీసీఎంబీ సహాయ సహకారాలు తీసుకుంటాం

జీవశాస్త్ర రంగాల వృద్ధికి మరిన్ని చర్యలు

ఫార్మాసిటీ ఏర్పాటుకు రంగం సిద్ధమని వెల్లడి

ఘనంగా బయో ఆసియా సదస్సు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌ : వైద్యం తీరుతెన్నులు మారిపోతున్న ఈ ఆధునిక కాలానికి తగ్గ చికిత్స విధానాలపై పరిశోధనలు చేసే ఓ అంతర్జాతీయ స్థాయి సంస్థ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. కణ, జన్యుస్థాయి చికిత్సలపై పరిశోధనలు చేపట్టే ఈ సంస్థను నిర్మించడంలో ప్రభుత్వం హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) సహాయం తీసుకోనున్నట్లు సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన బయోఆసియా సదస్సులో తెలిపారు. ఈ సంస్థ భారతీయులకు, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు మాత్రమే పరిమితమైన వ్యాధుల చికిత్సకు ప్రాధాన్యమిస్తుందని, కణ, జన్యుస్థాయి చికిత్సలను వీలైనంత తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతోందని వెల్లడించారు.


సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, కార్ల్‌ జూన్, స్విట్జర్లాండ్‌ రాయబారి ఆండ్రియాస్‌ బావుమ్, జయేశ్‌ రంజన్, వివిధ దేశాల ప్రతినిధులు 

జీవశాస్త్ర రంగాలకు రాజధాని..
హైదరాబాద్‌ నగరం జీవశాస్త్ర రంగాలకు దేశంలోనే ప్రధాన కేంద్రంగా మారిందని, బయో ఆసియా వంటి సదస్సులు ఇందుకు ఎంతగానో దోహదపడ్డాయని మంత్రి కేటీఆర్‌ వివరించారు. సుమారు 37 దేశాల నుంచి 2 వేల మంది సభ్యులు ఈ సదస్సులో పాల్గొనడం విశేషమన్నారు. దేశవ్యాప్త ఫార్మా ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ వాటా 35 శాతం కంటే ఎక్కువని, 800కుపైగా ఫార్మా, బయోటెక్, మెడికల్‌ టెక్నాలజీ కంపెనీలు ఇక్కడ పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని జీవశాస్త్ర రంగ కంపెనీల విలువ ఇప్పటికే 5 వేల కోట్ల డాలర్లుగా ఉంటే రానున్న పదేళ్లలో దీన్ని రెట్టింపు చేసేందుకు, కొత్తగా నాలుగు లక్షల ఉద్యోగాలు సృష్టించేందుకు అనువుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. లైఫ్‌ సైన్సెస్‌ గ్రిడ్‌ పేరుతో ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక ప్రకారం జినోమ్‌ వ్యాలీ విస్తరణతో జీవశాస్త్ర రంగ కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. వైద్య పరికరాల తయారీ కేంద్రంలో ఇప్పటికే కనీసం 20 కంపెనీలు పనిచేయడం మొదలుపెట్టాయని, సహజానంద్‌ మెడికల్‌ డివైజెస్‌ కంపెనీ ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని ఆయన వివరించారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబం«ధించి రంగం సిద్ధమైందని, పర్యావరణ అనుమతులు కూడా లభించాయని చెప్పారు. బయోకాన్‌ సంస్థ పరిశోధన విభాగం సిన్‌జీన్‌ హైదరాబాద్‌లో రూ.170 కోట్లతో కేంద్రాన్ని, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ ఇక్కడ ఓ కేంద్రం ఏర్పాటు చేయడం జీవశాస్త్ర రంగం కేంద్ర బిందువుగా హైదరాబాద్‌ స్థాయిని పెంచేవేనని పేర్కొన్నారు.

కార్ల్‌ జూన్‌కు ఎక్సలెన్సీ అవార్డు..
శరీర రోగ నిరోధక కణాలను చైతన్యవంతం చేయడం ద్వారా కేన్సర్‌కు చికిత్స అందించే ఇమ్యూనోథెరపీని అభివృద్ధి చేసిన అమెరికన్‌ శాస్త్రవేత్త, పెన్సిల్వేనియా యూనిర్సిటీకి చెందిన డాక్టర్‌ కార్ల్‌ జూన్‌కు ఈ ఏడాది బయో ఆసియా జినోమ్‌ వ్యాలీ ఆఫ్‌ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. జీవశాస్త్ర రంగంలో విశేష కృషి జరిపిన వారికి ఈ అవార్డు ఇస్తారు. రోగ నిరోధక కణాలనే కేన్సర్‌కు చికిత్స అందించొచ్చని తాము ముందు అనుకోలేదని కార్ల్‌ జూన్‌ తెలిపారు. అయితే 2010లో ఒక రోగితో మొదలైన ఈ ఇమ్యూనోథెరపీ విధానం రెండేళ్ల తర్వాత ముగ్గురికి విస్తరించిందని, ఆ తర్వాత 2017లో ఈ చికిత్స విధానానికి ఎఫ్‌డీఏ అనుమతులు లభించాయని, ప్రస్తుతం దీన్ని చాలా కేన్సర్ల చికిత్సలో ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి జయేశ్‌ రంజన్, బయోఆసియా సీఈవో శక్తి నాగప్పన్, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ బోర్డు సలహాదారు ప్రొఫెసర్‌ బాలసుబ్రమణ్యన్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు