‘కేక’తో కాక!

25 Sep, 2019 11:53 IST|Sakshi
సమావేశంలో మంత్రి కేటీఆర్, అధికారులు

హెచ్‌ఎండీఏ ప్రాజెక్టులను వేగిరం చేయాలని అధికారులకు సూచన  

బాలానగర్‌ ఫ్లైఓవర్‌ ఆలస్యంపై అసహనం  

లాజిస్టిక్‌ హబ్స్‌ త్వరితగతిన పూర్తవ్వాలి  

ఐసీబీటీపై దృష్టిసారించండి  

ల్యాండ్‌పూలింగ్‌ స్పీడప్‌ చేయండి  

కోకాపేట లేఅవుట్‌లో వరల్డ్‌ క్లాస్‌ వసతులు కల్పించండి  

అధికారులకు మంత్రి ఆదేశం  

హెచ్‌ఎండీఏ ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు నత్తనడకన సాగుతుండడంపై ‘సాక్షి’ మంగళవారం ‘రామన్న రాక.. కేకేనా!’ శీర్షికతో ప్రచురించిన కథనంపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఆయా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. హెచ్‌ఎండీఏ ప్రాజెక్టులపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రస్తుత ప్రాజెక్టుల్లో వేగం పెంచాలని, ప్రతిపాదిత ప్రాజెక్టులను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. 70 శాతమైన బాటసింగారం లాజిస్టిక్‌ హబ్‌ పనులను మరో నెల రోజుల్లో పూర్తి చేయాలని, 40 శాతమైన మంగళ్‌పల్లి లాజిస్టిక్‌ హబ్‌ను వచ్చే ఏడాది మే వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. వీటి మాదిరిగానే పటాన్‌చెరు, బొల్లారం, శామీర్‌పేట, పూడూరులోనూ ప్రభుత్వ  ప్రైవేట్‌ భాగస్వామ్యంతో హబ్‌లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.

వారంలో నివేదికివ్వండి..
మియాపూర్‌లో 55 ఎకరాల్లో ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినల్‌ (ఐసీబీటీ) నిర్మిస్తే వివిధ జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్‌ బస్సులు నిలపొచ్చు. ఫలితంగా నగరంపై ట్రాఫిక్‌ భారం తగ్గుతుంది. అయితే ప్రస్తుతం మియాపూర్‌ చౌరస్తా నుంచి ఐసీబీటీ ప్రాజెక్టు ప్రాంతానికి దాదాపు రెండు కిలోమీటర్ల మేర రహదారిపై ఇప్పటికే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. అయితే మియాపూర్‌ ఐసీబీటీ నుంచి ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డు వరకు (దాదాపు 8 కిలోమీటర్ల) రహదారి నిర్మిస్తే బస్సుల ప్రయాణానికి సాఫీగా ఉంటుంది. దీనిపై వెంటనే అధ్యయనం చేసి మరో వారం రోజుల్లో జరిగే సమావేశం వరకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

రెండేళ్లుగా అంతేనా...  
ట్రాఫిక్‌ కష్టాలను తీర్చేందుకు బాలానగర్‌లోని శోభన థియేటర్‌ నుంచి ఐడీపీఎల్‌ వరకు 1.09 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులకు ఎదురవుతున్న ఆటంకాలను మంత్రి కేటీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పనుల్లో వేగం లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. భూసేకరణతోనే ఆలస్యమవుతోందని అధికారులు చెప్పడంతో ఆ పనులను పర్యవేక్షిస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులను పిలిపించి కారణాలు తెలుసుకున్నారు. దాదాపు 80 శాతం వరకు భూసేకరణ పూర్తయిందని, మరో 20 శాతం త్వరగానే పూర్తి చేస్తామని అధికారులు సమాధానమిచ్చారు. వీలైనంత తొందరగా ఫ్లైఓవర్‌ పూర్తి కావాలని ఇరు శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్‌లో రానున్న చర్లపల్లి, నాగుల్లపల్లి రైల్వే టెర్మినల్స్‌ను దృష్టిలో ఉంచుకొని భూసేకరణ చేపట్టాలని సూచించారు. శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్లకు ప్రధాన రహదారులను అనుసంధానిస్తూ రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం పనితీరును మెరుగుపడాలని.. ఫారెస్ట్‌ బ్లాక్‌లు, పార్కుల్లో పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

భూసేకరణతో బూమ్‌...  
ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఉద్దేశించిన ల్యాండ్‌పూలింగ్‌ను వేగం చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు, ఏయే ప్రాంతవాసులు భూములివ్వడానికి ఆసక్తిగా ఉన్నారో తదితర వివరాలతో తర్వాతి సమావేశానికి రావాలని అధికారులను ఆదేశించారు. ఉప్పల్‌ భగాయత్‌ తరహాలోనే శివారు ప్రాంతాల్లో ల్యాండ్‌పూలింగ్‌ చేస్తే ఇటు హెచ్‌ఎండీఏకు ఆదాయం రావడంతో పాటు ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. సమీక్ష సమావేశంలో హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌కుమార్, కార్యదర్శి రాంకిషన్, ఇంజినీరింగ్‌ విభాగాధిపతి బీఎల్‌ఎన్‌ రెడ్డి, ప్లానింగ్‌ డైరెక్టర్లు బాలకృష్ణ, నరేంద్ర, అర్బన్‌ ఫారెస్ట్రీ డైరెక్టర్‌ శ్రీనివాస్, ల్యాండ్‌పూలింగ్‌ ఇన్‌చార్జ్‌ శ్రీనివాస్, ఎస్టేట్‌ ఆఫీసర్‌ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

కోకాపేట మెరవాలి..   
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కోకాపేట లేఅవుట్‌ను ప్రపంచస్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. 195.47 ఎకరాల్లో భారీ వెడల్పున్న రహదారులు పోనూ 146 ఎకరాల్లో ప్లాట్లు చేస్తున్న అధికారులు 120, 150 ఫీట్ల రహదారులతో పాటు ఓఆర్‌ఆర్‌కు అనుసంధానంగా రోడ్లు నిర్మించాలని సూచించారు. రహేజా సెజ్‌ ఎంట్రీలు, ఎగ్జిట్‌లకు రహదారులు ఉండేలా ఇప్పుడే చూసుకోవాలన్నారు. భవిష్యత్‌లో హోటల్స్, రెస్టారెంట్‌లు, పోలీసు స్టేషన్‌లు...  ఇలా సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వచ్చే అంశాలను దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్లాలన్నారు.

మరిన్ని వార్తలు