కేటీఆర్ @ కేపీ

14 Nov, 2019 09:46 IST|Sakshi

రూ.100 కోట్లపనులకుశ్రీకారం నేడు

కూకట్‌పల్లి పరిధిలో ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

సాక్షి, సిటీబ్యూరో: కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో దాదాపు రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి రూ.9.34 కోట్లతో చిత్తారమ్మబస్తీలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభిస్తారు. దీంతోపాటు రూ.5.65 కోట్ల వ్యయంతో కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లో నిర్మించిన ఇండోర్‌ స్టేడియాన్ని, 3వ ఫేజ్‌లో నిర్మించిన  రూ.2.78 కోట్ల ఆధునిక ఫిష్‌ మార్కెట్‌ను ప్రారంభించనున్నారు. కైతలాపూర్‌లో రూ.83.06 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులకు కూడా కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

హైటెక్‌సిటీ–బోరబండ స్టేషన్ల మధ్య నాలుగులేన్లతో నిర్మించనున్న కైతలాపూర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి(ఆర్‌ఓబీ) నిర్మాణ వ్యయంలో భూసేకరణకే రూ.25 కోట్లు ఖర్చుకానుండగా, మిగతా వ్యయంలో జీహెచ్‌ఎంసీ రూ.40 కోట్లు, రైల్వే శాఖ రూ.18.06 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఆర్‌ఓబీ పూర్తయ్యాక కూకట్‌పల్లి వైపు నుంచి హైటెక్‌సిటీవైపు సమాంతర మార్గంగా ఉపయోగపడుతుంది. జేఎన్‌టీయూ జంక్షన్, మలేసియన్‌ టౌన్‌షిప్‌ జంక్షన్, హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్, సైబర్‌ టవర్‌ జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది. సనత్‌నగర్, బాలానగర్, సికింద్రాబాద్‌ల వైపు నుంచి వెళ్లేవారు మూసాపేట వద్ద కైతలాపూర్‌ మీదుగా మాదాపూర్‌ మెయిన్‌రోడ్‌కు చేరుకోవచ్చు. తద్వారా మూడున్నర కి.మీ.ల మేర దూరం తగ్గడంతోపాటు గంట ప్రయాణ సమయం కలిసి వస్తుందని జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు పేర్కొన్నారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు..
చిత్తారమ్మ బస్తీలో 108 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సెల్లార్‌+స్టిల్ట్‌+9 అంతస్తులుగా నిర్మించారు. ఒక్కో ఇంటికి రూ.7.90 లక్షలు, మౌలిక సదుపాయాలకు రూ.75 వేల వంతున వెరసి మొత్తం వ్యయం రూ.8.65 లక్షలు ఖర్చు చేశారు. ఒక్కో ఫ్లాట్‌ విస్తీర్ణం 560 చదరపు అడుగులు ఉంది.

ఇండోర్‌ స్టేడియం..
ఇండోర్‌స్టేడియమ్‌లో రెండంతస్తులతోపాటు టెర్రస్‌ఫ్లోర్, స్విమ్మింగ్‌పూల్‌ నిర్మించారు. పురుషులు, మహిళలకు వేర్వేరు గ్రీన్‌రూమ్‌లు, కెఫ్టేరియా, యోగా రూమ్‌ తదితర సదుపాయాలున్నాయని జీహెచ్‌ఎంసీ పేర్కొంది.  

ఆర్‌ఓబీ వివరాలు..
పొడవు : 676 మీటర్లు
వెడల్పు: 16.61 మీటర్లు  
వరుసలు:4
ప్రయాణం: రెండు వైపులా  
ఈ మార్గంలో రద్దీ సమయంలోప్రయాణించే వాహనాలు గంటకు: 3902
2040 నాటికి గంటకు ప్రయాణించేవాహనాలు : 7207 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా