నగరంలో మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన

26 Mar, 2020 08:02 IST|Sakshi
గోల్నాకలోని నైట్‌షెల్టర్‌లో వసతులను తెలుసుకుంటున్న మంత్రి కేటీఆర్‌

నిరుపేద కూలీ కుటుంబానికి చేయూత

అంబర్‌పేటలోని నైట్‌ షెల్టర్‌ తనిఖీ

వివిధ అంశాలపై కలెక్టర్‌ శ్వేతామహంతికి దిశానిర్దేశం

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌ డౌన్‌ ప్రకటించిన తరువాత నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం హైదరాబాద్‌ నగరంలో ఆకస్మికంగా పర్యటించారు. మొదట ప్రగతి భవన్‌ నుంచి బుద్ధభవన్‌కు వెళ్తుండగా దారిలో రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న నిరుపేద కుటుంబాన్ని పలకరించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన కుటుంబం పనిచేసేందుకు ఉపాధి లేక కాలినడకన వేళ్తుండటంతో ఉప్పల్‌ వరకు వెళ్లడానికి తన సిబ్బందికి చెప్పి వాహనాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అక్కడే కనిపించిన బీహార్‌కు చెందిన ఓ కార్మికుడు, తాను అనాథను అని, తనకు చూసుకోవడానికి ఎవరూ లేరని మంత్రికి చెప్పిన వెంటనే,  జీహెచ్‌ఎంసీ నైట్‌ షెల్టర్‌ అతనికి బస ఏర్పాటు చేయాలని, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ శంకరయ్యను ఆదేశించారు.

బుద్ద భవన్‌ సందర్శన
బుద్ధ భవన్‌లో ఉన్న విపత్తు నిర్వహణ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. హైదరాబాద్‌ మహానగరంలో డిజాస్టర్‌ రెస్పాన్స్‌ టీంలు కొరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై ఎంఫోర్స్‌మెంట్‌– డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ను అడిగి తెలుసుకున్నారు. అక్కడే కంట్రోల్‌ రూమ్‌లో ఉన్న సిబ్బందిని వారి రోజువారీ పని గురించి వాకబు చేశారు. మంత్రితో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కూడా ఉన్నారు. జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను కూడా మంత్రి సందర్శించారు. వివిధ సమస్యలపై కంట్రోల్‌ రూంకు వస్తున్న ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్‌ కలెక్టర్‌లను అడిగి తెలుసుకున్నారు. ఈ సెంటర్‌లో ఉన్న సిబ్బందికి మంత్రి వివిధ సూచనలను చేశారు. వివిధ సమస్యలపైన వచ్చే కాల్స్‌ను మానవతా దృక్పథంతో స్పందించాలని సూచించారు. అనంతరం గోల్నాకలోని జీహెచ్‌ఎంసీ నైట్‌ షెల్టర్‌ను మంత్రి సందర్శించారు. అందుబాటులో ఉన్న వసతులను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. నైట్‌ షెల్టర్‌లోని అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పెన్షన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతిని ఆదేశించారు. అక్కడ పక్కనే ఉన్న కాలనీలో పర్యటించి కాలనీలోని ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లల్లోంచి బయటకు రావద్దని, ఎవరూ భయపడవద్దని, ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డిజాస్టర్‌ రెస్పాన్స్‌ టీంలు నిరంతరం చేపడుతున్న క్రిమి సంహారక మందు స్ప్రే కార్యక్రమాన్ని ఎర్రగడ్డలో పర్యవేక్షించారు.

నిత్యావసర సరుకుల కోసం పలువురి సేవలు వినియోగించుకోవాలి...
నిత్యావసర సరుకుల కోసం అమెజాన్, ప్లిప్‌ కార్ట్, గ్రోఫరŠస్స్, బిగ్‌ బాస్కెట్‌ వంటి వాటి సేవలను ఉపయోగించుకునేలా, వారి సిబ్బందిని లాక్‌ డౌన్‌ సందర్భంగా నియంత్రించకుండా చూడాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సూచించారు. వారి సరుకుల పంపిణీ కార్యకలాపాలు పునఃప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. నగరంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్న భవన నిర్మాణాలు, ఇతర మౌలిక వసతులు పనుల్లో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుల యోగక్షేమాలు, వసతులుపై తర్వరలోనే భవన నిర్మాణ సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. అప్పటిదాకా వారికి వసతికి, ఆహారానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కేటీఆర్‌ సూచించారు. ప్రస్తుతం నగరంలోని హాస్టళ్లను మూసివేస్తుండటంతో వస్తున్న ఇబ్బందులపైన తగిన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌లకు సూచించారు. నగరంలోని హాస్టళ్ల యాజమాన్యాలతో మాట్లాడి అందులో ఉంటున్న వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అదేశించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు