థాయ్‌లాండ్‌తో తెలంగాణ ఒప్పందం

18 Jan, 2020 12:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : థాయ్‌లాండ్‌కు భారత్‌కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మదాపూర్‌లో శనివారం ఇండియా-థాయ్‌లాండ్‌ మ్యాచింగ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి థాయ్‌లాండ్‌ నుంచి ఉప ప్రధాని జరీన్‌ లక్సనావిసిత్‌, మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. రబ్బర్ వుడ్ పరిశ్రమలో థాయ్ ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణతో థాయ్‌ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుని, పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ష్రం దేశ వృద్ధి రేటును మించి అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. థాయ్‌లాండ్‌ నుంచి భారత్‌కు గేట్‌వేగా తెలంగాణతో  అనుసంధానం చేయాలని తెలిపారు. తెలంగాణలో వాణిజ్య రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని, థాయ్‌ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఫర్నిచర్‌ పర్క్‌ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ థాయ్‌లాండ్‌ ఉప ప్రధానిని కోరారు. 

థాయ్‌లాండ్‌ ఉప ప్రధాని  భారత్‌ పర్యటన పెట్టుబడులకు ఊతం ఇచ్చేలా ఉందన్నారు. తెలంగాణలో ఫుడ్‌ ప్రసెసింగ్‌కు సరిపడా నీటి వనరులు ఉన్నాయన్నారు. ఫర్నీచర్‌ ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెడుతున్న థాయ్‌లాండ్‌.. రాష్ట్రంలో నూతన  ఆవిష్కరణలు పరిచయం చేయాలని సూచించారు.  రబ్బర్‌ వుడ్‌, టింబర్‌ వుడ్‌ ఉత్పత్తుల రవాణా కోసం 400 కి. మీ దూరంలో కృష్ణపట్నం పోర్టు ఉందని, రవాణా సబ్సిడీలు కూడా అందిస్తామని తెలిపారు. బ్యాంకాక్‌-హైదరాబాద్‌ విమాన సర్వీసులు పెంచి పర్యాటకాన్ని అభివృద్ధి చెందేలా ప్రొత్సహించాలని అన్నారు. అనంతరం కేటీఆర్‌ జరీన్‌ లక్సనావిత్‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. 

మరిన్ని వార్తలు