ఆ మృగానికి సరైన శిక్షే పడింది: కేటీఆర్‌

8 Aug, 2019 20:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన కేసులో ముద్దాయి ప్రవీణ్‌ కుమార్‌కు ఉరిశిక్ష విధించడం పట్ల టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. చిన్నారి శ్రీహితపై అత్యాచారం, హత్య కేసులో వరంగల్‌ అదనపు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఇటువంటి కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు, మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాలన్నారు. ఈ కేసులో చిన్నారి తరఫున వాదించిన న్యాయవాదులకు అభినందనలు తెలిపారు.
 

పోలీసులకు కృతజ్ఞతలు: శ్రీహిత తల్లిదండ్రులు
తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడికి కోర్టు మరణ శిక్ష విధించడంతో శ్రీహిత తల్లిదండ్రులు రచన, జగన్‌లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ను కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడికి మరణశిక్ష పడటానికి వరంగల్‌ పోలీసులు, కమిషనర్‌ చేసిన కృషి మరువలేనిదన్నారు. 48 రోజుల్లో నిందితుడికి మరణ శిక్ష ఖరారు కావడంతో వరంగల్‌ పోలీసులు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారని తెలిపారు. నేరాలకు పాల్పడే వారికి ఈ తీర్పు ఓ హెచ్చరికగా నిలవాలని వారు కోరుకున్నారు.

మరిన్ని వార్తలు