అత్యాచారానికి ఉరిశిక్షే సరి!

2 Dec, 2019 05:44 IST|Sakshi

పునఃసమీక్షకు ఆస్కారం ఉండరాదు

బాధితులకు సత్వర న్యాయం అందించాలి

ప్రధాని మోదీకి ట్వీట్టర్‌ వేదికగా కేటీఆర్‌ విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: మహిళలు, పిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారికి సత్వరమే ఉరిశిక్ష విధించాలని, దీనిపై పునః సమీక్షకు వీల్లేని చట్టాలను తీసుకురావాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారకరామారావు.. ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. చట్టాలంటే భయం లేకుండా మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గుల నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జస్టిస్‌ ఫర్‌ దిశ ఘటన నేపథ్యంలో ట్విట్టర్‌ వేదికగా ప్రధాని దృష్టికి కేటీఆర్‌ పలు విషయాలు తీసుకెళ్లారు. మహిళలపై అఘాయిత్యాల పట్ల ఆవేదన చెందుతూ, నిస్సహాయంగా న్యాయం కోరుతున్న లక్షలాది మంది తరఫున ఈ వినతి చేస్తున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు.

అత్యాచార నిందితులకు శిక్ష అమలులో  జాప్యం జరుగుతోందని, న్యాయం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్లేనని అన్న నానుడిని ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తు చేశారు. ఇలాంటి ఉదంతాల్లో అమలు చేయాల్సిన చట్టాలపై ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ఒకరోజు పాటు చర్చ జరపాలని విజ్ఞప్తి చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించేలా, కాలం చెల్లిన ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ) చట్టాలను సవరించాల్సిన అవసరముందన్నారు. ఏడేళ్ల కింద జరిగిన నిర్భయ ఘటనలో నిందితులకి పడిన ఉరి శిక్షలను ఇప్పటి వరకు అమలు చేయలేదని గుర్తు చేశారు. 9 నెలల పసి పాపపై అత్యాచారం చేసిన నిందితులకు దిగువ కోర్టు విధించిన ఉరి శిక్షను పైకోర్టు జీవిత ఖైదుగా మార్చిన ఉదంతాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు. దిశ హత్య కేసులో నిందితులను సత్వరంగా పట్టుకున్నారని, తమ బిడ్డను కోల్పోయి దుఖంలో ఉన్న ఆమె కుటుంబానికి ఎలా స్వాంతన చేకూర్చాలో అర్థం కావట్లేదన్నారు.

మరిన్ని వార్తలు