సంక్షోభంలోనూ పెట్టుబడులకు చాన్స్‌

8 May, 2020 01:42 IST|Sakshi

ప్రభుత్వాలు, పరిశ్రమలు ప్రాధాన్యతలు సమీక్షించుకోవాలి

విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం కృషి

ఈబీజీ ప్రతినిధులతో కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు అవకాశాలున్నట్లు తాము భావిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీ రామారావు అన్నారు. ప్రస్తుత సంక్షోభం నేర్పిన పాఠాలతో పరిశ్రమలు, ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతలను పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా యూరోపియన్‌ బిజినెస్‌ గ్రూప్‌ (ఈబీజీ) ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. పలు దేశాల రాయబారులతో పాటు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఒకే దేశం లేదా ఒకే ప్రాంతంలో పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టే అంశంపై కంపెనీలు పునరాలోచనలో పడ్డాయని, ఈ నేపథ్యంలో భారత్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని కేటీఆర్‌ వెల్లడించారు. ఆయా దేశాల్లోని పెట్టుబడిదారులు, కంపెనీలతో ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు సహకరించాల్సిందిగా ఆ దేశాల రాయబారులను ఆయన కోరారు. ఫార్మా, లైఫ్‌సైన్సెస్, ఐటీ, డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్, టెక్స్‌టైల్‌ వంటి రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉన్నందున పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ప్రపంచ ప్రమాణాలు.. 
సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ)లో తెలంగాణ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అగ్రస్థానంలో ఉం దని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈఓడీబీలో తెలంగాణ ప్రపంచంలోనే టాప్‌–20 జాబితాలో ఉండే అవకాశం ఉందని, విదేశీ పెట్టుబడిదారులు భారత్‌ను రాష్ట్రాల కోణాల్లో చూడాల్సి ఉందన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఐదేళ్లలో 13వేల కంపెనీలకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కు ఉన్న అనుకూల అంశాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు ప్రపంచ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోవని, గత ఐదేళ్లుగా ఇక్కడి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రపంచవ్యాప్తంగా వినిపించాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు