వస్త్ర ఉత్పత్తిలో నాణ్యత పెరగాలి

26 Feb, 2017 04:12 IST|Sakshi
సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వస్త్రాన్ని పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్‌

వస్త్రోత్పత్తిదారుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌
సిరిసిల్లలో కామన్‌ ఫెసిలిటీ సెంటర్లు
వారంలోగా పార్క్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేయాలి


సిరిసిల్ల: ‘ఉత్పత్తులు పెరగాలి.. వస్త్రం నాణ్యంగా ఉండాలి.. అప్పుడే మార్కెట్‌లో పోటీని తట్టుకుని నిలబడగలం.. వస్త్రం ఎగుమతులను సాధించగలం’అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఆయన శనివారం సందర్శించారు. అనంతరం వస్త్రోత్పత్తిదారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘నేతన్నలు ప్రపంచస్థాయికి చేరాలి.. సిరిసిల్ల బ్రాండ్‌ ఇమేజ్‌గా వస్త్రోత్పత్తి రంగం అభివృద్ధి సాధించాలి’ అని అన్నారు. టెక్స్‌టైల్‌పార్క్‌తోపాటు సిరిసిల్లలోనూ కామన్‌ ఫెసిలిటీ సెంటర్ల(సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆధునికమైన సైజింగ్, వార్పిన్‌ యంత్రాలను ఉపయోగించుకోవాలని  సూచించారు.

టెక్స్‌టైల్‌ పార్క్‌లో 220 పరిశ్రమలు స్థాపించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 110 పరిశ్రమలే వస్త్రోత్పత్తిని ప్రారంభించాయని, వాటి స్థాపనకు ప్లాట్లు తీసుకున్న వారికి నోటీసులు జారీ చేసి పరిశ్రమలు ప్రారంభమయ్యేలా చూడాలని, లేకుంటే వాటిని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కేటాయించాలని అధికారులకు సూచిం చారు.   వారం రోజుల్లోగా వస్త్రోత్పత్తిదారు లు టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధి కమిటీని వేసుకోవాలని, లేకుంటే ప్రభుత్వమే కమిటీ వేస్తుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.  మంత్రి వస్తున్నాడని తెలిసినా పార్క్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, అంతా చెత్త పేరుకుపోయిందని, పార్క్‌ దుస్థితి ఇదా అని ఏడీ అశోక్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిరిసిల్ల వస్త్రవ్యాపారులు తిరుపూర్‌కు అధ్యయన యాత్రకు వెళ్లి రావాలని మంత్రి సూచించారు. ‘నేను మంత్రిగా ఉన్నా.. కొత్తపరిశ్రమల స్థాపనకు, ప్రభుత్వ సాయం పొందేందుకు ఇదే మంచి తరుణం’ అని కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల వస్త్ర వ్యాపారులతో సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహిస్తే.. కార్మికులతో సమావేశం పెట్టరా అని కొందరు నెగటివ్‌గా మాట్లాడుతున్నారని, ముందు యజమానులను ఒప్పించాలని వారితో సమావేశం నిర్వహించామని చెప్పారు.

శివరాత్రి జాతర ఏర్పాట్లు
వేములవాడలో మహాశివరాత్రి ఏర్పాట్లు బాగున్నాయని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. టెక్స్‌టైల్‌ పార్క్‌ను గాడిలో పెట్టాలని, నీటి వసతి కల్పించాలని, ఇందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జౌళిశాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్, సౌత్‌ ఇండియా మిల్స్‌ అధ్యక్షుడు సెంథల్‌కుమార్, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ అధ్యక్షుడు అక్షయపటేల్, సెల్వరాజ్, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు