యువరాజు కేటీఆర్?

15 Apr, 2015 03:06 IST|Sakshi

 టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు
 24న ప్లీనరీలో ప్రకటన
 27న బహిరంగ సభ
 36,000 ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు (అంచనా)
సంస్థాగతంగా బలోపేతం కావడమే ఏకైక లక్ష్యం
విపక్షాలను దీటుగా ఎదుర్కొనే వ్యూహం


 సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పునాదులపై అధికార పీఠాన్ని అధిష్టించిన టీఆర్‌ఎస్ ఇప్పుడు సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ఇందుకు కొత్తగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తెరపైకి తీసుకువస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం త్వరలో జరగనున్న పార్టీ ప్లీనరీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పేరును ప్రకటించే అవకాశముంది. రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఈ పదవిని కట్టబెట్టనున్నట్లు పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్.. గత శాసనసభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకన్నా మూడు సీట్లు మాత్రమే ఎక్కువగా గెలుచుకుని 63 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి మూడింట రెండొంతుల సీట్లు నెగ్గడమే లక్ష్యంగా పార్టీని తీర్చిదిద్దేం దుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో తుది నిర్ణయం పార్టీ అధినేతకే వదిలేశామని ఓ సీనియర్ నేత చెప్పారు.

 రహస్యంగా కసరత్తు: ఏటా నిర్వహించే పార్టీ ప్లీనరీ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల వల్ల జరగలేదు. పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 24న ప్లీనరీ, 27న భారీ బహిరంగ సభ నిర్వహణకు ముహూర్తం పెట్టారు. 24న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో 36 వేల మంది ప్రతినిధులతో నిర్వహించనున్న ప్లీనరీలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. గులాబీ దళపతిగా మరోసారి సీఎం కేసీఆర్ ఎన్నిక లాంఛనమే కానుంది. అయితే, సీఎంగా పాలనాపరమైన బాధ్యతల్లో కేసీఆర్ తలమునకలవుతున్నందున పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఆయన సరిగా దృష్టి సారించలేకపోతున్నారన్న అభిప్రాయం నేతల్లో నెలకొంది. పార్టీకి, ప్రభుత్వానికి ఒక్కరే సారథ్యం వహించినా... వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉంటే పార్టీకి, ప్రభుత్వానికి సంధానకర్తగా ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించాలన్న ప్రతిపాదన కొద్ది నెలల కిందటే వచ్చినట్లు ఓ సీనియర్ నేత చెప్పారు. అతి తక్కువ మంది నేతల మధ్య మాత్రమే ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్య నేతల నుంచి కేసీఆర్ ఇప్పటికే అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. పార్టీని బలోపేతం చేసుకోవడం తో పాటు మిగిలిన నాలుగేళ్లలో విపక్షాల విమర్శలకు పార్టీపరం గా దీటైన సమాధానం చెప్పడానికి సీఎంకు ప్రత్యామ్నాయ నేత ఉంటే బాగుంటుందన్న చర్చ జరిగినట్లు తెలిసింది. జాతీయ స్థాయిలోనూ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అవసరమనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం.
 
 పగ్గాలు ఎవరికి?
 వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలను ఎవరికి అప్పగిస్తారన్నది తేలాల్సి ఉంది. పార్టీలో జరుగుతున్న ప్రచారం మేరకు మంత్రి కె.తారకరామారావుకే ఆ బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. మరో ఇద్దరు ముగ్గురు మంత్రులకూ పార్టీలో కీలక బాధ్యతలుఅప్పజెబుతారని, ఈ బృందం పార్టీ కోసం ప్రత్యేకంగా పనిచేస్తుందని అంటున్నారు. సీఎం కేసీఆర్ అంతరంగిక వర్గాల్లోనే ఈ విషయంపై  చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులపై ఇప్పటికే కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. విపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు ఆయా శాఖల మంత్రు లే సమాధానం ఇచ్చుకుంటున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి వంటి వారు కౌంటర్ ఇస్తున్నారు. విపక్షాల విమర్శలను పార్టీ తరఫున తిప్పికొట్టాలంటే ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ అధ్యక్షుడి కం టే, దాదాపు అధ్యక్షుని స్థాయి, హోదా ఉండే మరో నేత ఉండాలన్న అభిప్రాయంతోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ మంత్రి హరీశ్‌రావును ప్రభుత్వ వ్యవహారాల్లో, మంత్రి కేటీఆర్‌ను పార్టీ వ్యవహారాల్లో కుడి, ఎడమలుగా వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

>
మరిన్ని వార్తలు