రేపు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి కేటీఆర్

28 Sep, 2016 19:27 IST|Sakshi
రేపు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం సహా రాష్ట్రంలోని ఇతర పురపాలక పట్టణాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రకృతి విపత్తుల సహాయ నిధిని కోరడంతో పాటు రాష్ట్రంలోని పురపాలికల్లో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని కోరేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం అక్కడ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో సమావేశమై నిధుల కేటాయింపులపై చర్చించనున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, ఇతరాత్ర మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించనున్నారు. వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర పురపాలికల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక రూపొందించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వర్షాలతో జరిగిన నష్టానికి విపత్తుల సహాయ నిధితో పాటు ఇతర పట్టణాల్లో చేపట్టనున్న పలు మౌళిక సదుపాయాల ప్రాజెక్టులకు సైతం కేంద్ర సహాయాన్ని ఆయన కోరనున్నారు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, అవసరమైన నిధులు, కావాల్సి కేంద్ర సహాయం వంటి అంశాలతో ఓ నివేదికను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు సమర్పిస్తారు.

మరిన్ని వార్తలు