సాహసోపేత సంస్కరణలు రావాలి

2 May, 2020 04:02 IST|Sakshi

కార్మిక, బ్యాంకుల దివాళా చట్టాలు మార్చాలి

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు కేటీఆర్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ విధానాల్లో సమూల మార్పుల ద్వారా సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) ర్యాంకింగ్‌లో ప్రపంచ జాబితాలో భారత్‌ టాప్‌ 20లో చేరేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు కేటీఆర్‌ లేఖ రాశారు. కాలం చెల్లిన కార్మిక చట్టాలతో పాటు బ్యాంకుల దివాళాకు సంబంధించిన చట్టాలను సమూలంగా మార్చాలన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా పెట్టుబడుల పట్ల స్థిరమైన, కచ్చితమైన, నమ్మకమైన విధానాలు ఉండాలన్నారు.

మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ 
దేశంలో మౌలిక వసతులు, నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కేటీఆర్‌ లేఖలో సూచించారు. హైదరాబాద్‌ ఫార్మా సిటీ, కాకతీయ మెగాటెక్స్‌టైల్‌ పార్కు వంటి వాటికి మద్దతు ఇవ్వాలని, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. ఎగుమతుల్లో ఇతర దేశాలతో పోటీ పడేలా తీర్చిదిద్దాలని, ఫార్మా, ఏరోస్పేస్, టెక్స్‌టైల్, లెదర్, ఐటీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తూ వాటిని భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేటీఆర్‌ సూచించారు.

ఎంఎస్‌ఎంఈ రంగాన్ని కాపాడుకోవాలి 
దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్‌ఎంఈ)ని కాపాడుకోవాలని కేటీఆర్‌ లేఖలో సూచించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎంఎస్‌ఎంఈ రంగానికి నేరుగా ఆర్థిక సాయం అందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. దేశానికి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలపై ఎంపవర్డ్‌ స్ట్రాటజీ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలనే అంశాన్ని మరోమారు కేటీఆర్‌ లేఖలో ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు