రూపాయి లేదు..వైద్యమెలా!

25 Nov, 2019 02:23 IST|Sakshi
చికిత్స పొందుతున్న కుబ్రా

ఫ్లైఓవర్‌ ఘటనలో గాయపడిన కుబ్రా దీనావస్థ

ఆపరేషన్‌ కోసం రూ.5 లక్షలు అవసరమన్న వైద్యులు

సహాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు

సాక్షి, హైదరాబాద్‌/గచ్చిబౌలి: కష్టాలు, కన్నీళ్లు దిగమింగి బీటెక్‌ పూర్తి చేసిందామె. ఏడాది క్రితమే అనంతపురం నుంచి హైదరాబాద్‌ వచ్చి ఎస్సార్‌ నగర్‌ హాస్టల్‌లో ఉంటూ ఓ వైపు ప్రత్యేక కోర్సులు, మరోవైపు ఇంటర్వూ్యలకు హాజరవుతూ అదృష్టా న్ని పరీక్షించుకుంటోంది. శనివారం ఓ కంపెనీ ఇంటర్వూ్యకు హాజరై సెలక్ట్‌ కూడా అయింది. ఈ వార్తను సెల్‌ఫోన్‌లో అనంతపురంలో ఉన్న  తండ్రి తో పంచుకుంటున్న సమయంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఒంటినిండా గాయాలతో చావుబతుకులతో పోరాడుతోంది. ఇది శనివారం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుబ్రా బేగం (23) దుస్థితి. ప్రసుత్తం ఆమె గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఆస్పత్రి వద్ద కుబ్రా తల్లిదండ్రులు

చేతిలో రూపాయి లేక విలవిల..
అనంతపురంనకు చెందిన కుబ్రా బేగం తండ్రి అబ్దుల్‌ అజీం. పెయింటర్‌గా సాదాసీదా జీవనం సాగిస్తూ కూతురు కుబ్రాతో పాటు కుమారుడు కాలిఖ్‌ను ఉన్నత చదువులు చదివించాడు. ఆయన సంపాదనంతా పిల్లల చదువులు, జీవనోపాధికే సరిపోయింది. ప్రమాదం గురించి తెలియగానే కుబ్రా తండ్రి, తల్లి, సోదరుడు హైదరాబాద్‌కు బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున నగ రానికి చేరుకున్న కుబ్రా తల్లిదండ్రులకు ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షల నిమిత్తం రూ.లక్షా పది వేలు అయ్యాయని చెప్పారు. కుబ్రాకు ఒళ్లంతా గాయాలున్నాయని, ఆపరేషన్‌ కోసం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని, చెల్లిస్తే మిగతా వైద్యం చేస్తామని తెలిపారు.

అప్పటికే హైదరాబాద్‌లోని సమీప బంధువుల నుంచి రూ.30 వేలు తీసుకుని ఫీజు చెల్లించిన అబ్దుల్‌ రూ.5 లక్షల కోసం తనకు తెలిసిన వారందరికీ ఫోన్లు చేశాడు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆస్పత్రి ఎదుటే భార్య, కుమారుడితో విషాదంగా గడిపేశాడు. చేతిలో రూపాయి లేక కుబ్రాకు వైద్యం ఎలా చేయిం చాలో తెలియక సతమతమవుతున్నాడు. కుబ్రాను ఆస్పత్రిలో చేర్చించిన పోలీసులు ఆపై అటు కన్నెత్తి చూడలేదని వారు వాపోతున్నారు. ఆదివారం రాత్రి కుబ్రా సోదరుడు ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. తాము నిరుపేదలమని, రూ.5 లక్షలు చెల్లించే స్థోమత తమకు లేదని తన అక్క ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను వేడుకున్నాడు.

మరిన్ని వార్తలు