ప్రాధాన్యత రంగాల అభివృద్ధికి ప్రణాళిక

20 Sep, 2019 02:32 IST|Sakshi
లక్సంబెర్గ్‌ రాయబారి కుగెనర్‌కు జ్ఞాపిక అందజేస్తున్న మంత్రి కేటీఆర్, జయేశ్‌ రంజన్‌ 

మంత్రి కేటీఆర్‌ వెల్లడి

మంత్రిని కలిసిన  పలు విదేశీ ప్రతినిధి బృందాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పర్యటిస్తున్న వివిధ విదేశీ ప్రతినిధి బృందాలు గురువారం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యాయి. మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలక శాఖ భవనంలో జరిగిన వేర్వేరు సమావేశాల్లో లక్సెంబర్గ్‌ రాయబారితో పాటు, ఫ్రెంచ్‌ కాన్సుల్‌ జనరల్‌తోనూ కేటీఆర్‌ భేటీ అయ్యారు. తొలుత భారత్‌లో దక్షిణాఫ్రికా హైకమిషనర్‌ సిబుసిసో ఎన్డెబెలో నేతృత్వంలోని దక్షిణాఫ్రికా ప్రతినిధి బృందం కేటీఆర్‌ను కలిసింది. దక్షిణాఫ్రికాకు చెందిన పలు కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను పరిశీలించేందుకు పర్యటిస్తున్నట్లు హైకమిషనర్‌ తెలిపారు. తెలంగాణ పారిశ్రామిక వర్గాలతో జరుగుతున్న సమావేశాల్లో సానుకూల స్పందన వచ్చిం దని సిబుసిసో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానంతో పాటు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చూపిన చొరవను కేటీఆర్‌ వివరించా రు. టీఎస్‌ఐపాస్‌ వంటి పారిశ్రామిక విధానంతో పాటు, ఐటీ, ఫార్మా తదితర 14 ప్రధాన రంగాలను గుర్తించి, వాటి అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలని కేటీఆర్‌ వివరించారు.  

లక్సంబెర్గ్‌ రాయబారితో భేటీ  
భారతదేశంలో లక్సంబెర్గ్‌ రాయబారి జీన్‌ క్లాడ్‌ కుగెనర్‌ కూడా గురువారం కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న లక్సెంబర్గ్‌ కంపెనీల కార్యకలాపాలకు ప్రభుత్వ విధానాల ద్వారా సానుకూల స్పందన ఉందని కుగెనర్‌ తెలిపారు. ఫిన్‌టెక్, ఏరోస్పేస్, ఆటోమొబైల్‌ రంగాల్లో పెట్టబడులకు సంబంధించి తెలంగాణతో కలిసి పనిచేస్తామన్నారు. అనంతరం ఫ్రెంచ్‌ కాన్సుల్‌ జనరల్‌ మార్జరీ వాన్‌ బేలిగమ్‌ తాను కాన్సుల్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో కేటీఆర్‌తో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ఐటీ, పారిశ్రామిక పాలసీలను మార్జరీవాన్‌ ప్రశంసించారు. రాష్ట్రంలో ఫ్రాన్స్‌ పెట్టుబడులకు సహకారం అందించాలని కేటీఆర్‌ కోరారు.  

మరిన్ని వార్తలు