ఫీజులపై ఉన్న శ్రద్ధ భద్రతపై ఏదీ!

4 Aug, 2018 00:51 IST|Sakshi
చిన్నారుల మృతదేహాలతో పాఠశాల ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు

న్యూ సెంచరీ యాజమాన్యం నిర్లక్ష్యంపై పలువురి ఆగ్రహం

చిన్నారుల మృతదేహాలతో పాఠశాల ఎదుట ఆందోళన

పాఠశాల శాశ్వతంగా మూసివేతకు నిర్ణయం

విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని న్యూ సెంచరీ పాఠశా లలో గురువారం స్టేజీ కూలిపోయి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటనపై నిరసన వెల్లువెత్తింది. చిన్నారుల మృతదేహాలతో శుక్రవారం పాఠశాల ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. వారి రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నారుల మృతదేహాలపై పడి బంధువులు రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

కాగా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు ఆరోపించారు. పాఠశాల పైకప్పు ప్రమాదకరంగా ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. మూడు గంటలపాటు ఆందోళన నిర్వహించినా యాజమాన్యం స్పందించకపోవడంతో ఆగ్రహించిన పలువురు పాఠశాల బస్సును ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

రూ.5 లక్షల పరిహారం...
సంఘటన జరిగిన వెంటనే న్యూ సెంచరీ పాఠశాల డైరెక్టర్‌ ఎం.వెంకట్‌ పరారయ్యాడు. చిన్నారులు మృతి చెంది 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. పోలీస్‌ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకుని యాజమాన్యం కోసం నిరీక్షించారు. యాజమాన్యం అజ్ఞాతంలో ఉండటంతో అధికారులతో చర్చించి నష్టపరిహారాన్ని ప్రకటించారు.

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. స్కూల్‌ అనుమతిని రద్దు చేయడంతో పాటు భవనాన్ని పూర్తిగా తొలగిస్తామన్నారు. పాఠశాలలోని 176 మంది విద్యార్థులకు నష్టం జరగకుండా సమీపంలోని 11 పాఠశాలల్లో చేర్పిస్తామని, వారికయ్యే ఫీజును ప్రభు త్వమే భరిస్తుందని ప్రకటించారు. అలాగే మృతి చెంది న విద్యార్థినులు మణికీర్తన, చందనశ్రీ కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున నష్టపరిహారం అందివ్వనున్నట్లు వివరించారు.

జాయింట్‌ కలెక్టర్‌ సందర్శన...
మేడ్చల్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఉదయం పాఠశాలను సందర్శించారు. స్థానికంగా ఉన్న వారితో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో శ్రీధర్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఈవోను సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అలాగే ప్రతి వారం మండల ఎడ్యుకేషన్‌ అధికారులు అన్ని పాఠశాలలను తనిఖీ చేసి ఎప్పటికప్పడు రిపోర్ట్‌ ఇవ్వాలన్నారు.


ఒక విద్యార్థి డిశ్చార్జ్‌..
న్యూ సెంచరీ పాఠశాల ప్రమాదంలో గాయపడి జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు విద్యార్థుల్లో సందీప్‌ను శుక్రవారం వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. నరేశ్, లిఖిత ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.


గతంలోనే చెప్పాం...
పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పిల్లర్లు కుంగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయని గతంలోనే పలుమార్లు యాజమాన్యానికి గుర్తు చేశాం. లైట్‌ వెయిట్‌గానే ఉంది.. ప్రమాదమేమీ లేదని నిర్లక్ష్యం వహించారు. పాఠశాల పైకప్పు కూడా తాటి చెక్కలతో పేర్చారు. యాజమాన్య నిర్లక్ష్యంతోనే చిన్నారులు బలయ్యారు. – రమణారావు, విద్యార్థి తండ్రి వెంకట్రావ్‌నగర్‌

నా ఆనందం ఆవిరైంది...
నా మనవరాలు మణికీర్తన గొప్పగా చదువుకుంటుందని చాలా ఆనందపడ్డాం. పెద్ద డాక్టర్‌ అయి నాకు మెరుగైన వైద్యం చేస్తానని, తన దగ్గరే ఉంచుకుంటా అని చెబుతుంటే ఎంతో ఆనందపడ్డా. ఇప్పుడు ఆ ఆనందమంతా ఆవిరైపోయింది. నా మనవరాల్ని ఈ పాఠశాల బలిగొంది. – పద్మ, మణికీర్తన నానమ్మ

యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే...
రూ.లక్షల ఫీజులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల భద్రతలో లేకపోవడం దారుణం. కేవలం యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విలువైన చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిశాయి. నా మనవరాలు పాఠశాలలో చేరి రెండు నెలలైనా కాలేదు.. ఇంతలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. ఇది మాకు తీరని గుండెకోత. దీనికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలి.
– డి. రంగయ్య, చందనశ్రీ తాతయ్య

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు