ప్రముఖ సాహితీవేత్త కులశేఖర్‌రావు కన్నుమూత

21 May, 2019 01:38 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ సాహితీవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య మడుపు ఎం.కులశేఖర్‌రావు ఆదివారం రాత్రి కెనడాలో కన్నుమూశారు. కొంతకాలంగా ఒంటారియాలోని బ్రాఫ్టన్‌లో ఉంటున్న కులశేఖర్‌రావుకు ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం) నిద్రలో గుండెపోటురాగా అంబులెన్స్‌ వచ్చేలోపే మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో జన్మించిన కులశేఖర్‌రావు తెలంగాణలో తొలితరం సాహితీవేత్త. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ, ఎంఏ తెలుగు చదివారు.

ఆంధ్ర వచన వాజ్ఞ్మయ వికాసంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. ఉస్మానియా వర్సిటీ తెలుగు శాఖలో మూడున్నర దశాబ్దాలపాటు లెక్చరర్‌గా, రీడర్‌గా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా, శాఖ అధిపతిగా సేవలందించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో పలు రచనలు, పద్యరచనలు సైతం అందించారు. తెలుగు సాహిత్య చరిత్రను ఆంగ్లంలో రాశారు. డాక్టర్‌ సి.నారాయణరెడ్డి సాహిత్య బహుముఖి వ్యక్తిత్వంపై ఆంగ్లంలో ఒక గ్రంధాన్ని రచించారు. కొన్నాళ్లుగా కెనడాలో కుమారుడు ప్రభాకర్‌రావు వద్దనే ఉంటున్నారు. కులశేఖర్‌రావు తెలంగాణ సారస్వత పరిషత్‌ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు.  

తెలంగాణ సారస్వత పరిషత్‌ సంతాపం 
కులశేఖర్‌రావు మృతికి తెలంగాణ సారస్వతపరిషత్‌ సోమవారం ప్రగాఢ సంతాపం తెలిపింది. వచన వాజ్ఞ్మయ వికాసంపై ఆయన చేసిన పరిశోధన ప్రామాణికమైందని, కవిగా, విమర్శకులుగా విశిష్ట కృషి చేశారని పరిషత్‌ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధానకార్యదర్శి డాక్టర్‌ జె.చెన్నయ్య అన్నారు. 

మరిన్ని వార్తలు