కర్ణాటకలో పెనుమార్పులు

16 May, 2019 01:25 IST|Sakshi

ఎన్నికల తర్వాత కుప్పకూలనున్న కుమారస్వామి ప్రభుత్వం: యడ్యూరప్ప  

తాండూరు టౌన్‌: లోక్‌సభ ఎన్నికల అనంతరం కర్ణాటకలో పెనుమార్పులు సంభవిస్తాయని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. ప్రస్తుతం ఉన్న కుమారస్వామి ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల అనంతరం కుప్పకూలే అవకాశం ఉందని, ఇప్పటికే ఆ ప్రభుత్వంలోని 20 మందికి పైగా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్నారు. బుధవారం ఆయన తెలంగాణ–కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని చించోళిలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ తాండూరులో బీజేపీ సీనియర్‌ నేత అరవింద లింబావళితో కలిసి విలేకరులతో మాట్లాడారు.

చించోళి, కందుగోళ్‌ నియోజకవర్గాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 25 వేలకు పైగా మెజార్టీ సాధిస్తారన్నారు. ప్రభుత్వం పడిపోతే మల్లిఖార్జున ఖర్గే సీఎం అవుతారని, ఏకంగా సీఎం కుమారస్వామి ప్రకటించడం పట్ల వారి ప్రభుత్వంపై ఆయనకు నమ్మకం సడలినట్లేనని ఎద్దేవా చేశారు. ఈసారి కర్ణాటకలో 20 నుంచి 22 ఎంపీ సీట్లు గెలుస్తామని, దేశవ్యాప్తంగా 285కు పైగా ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిచి తిరిగి నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. అనంతరం సీనియర్‌ నాయకులు అరవింద లింబావళి మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల అనంతరం కర్ణాటకలో కుమారస్వామి ప్రభు త్వం కూలిపోతుందని, యడ్యూరప్ప తిరిగి సీఎం అవుతారన్నారు.

మరిన్ని వార్తలు