కుమ్మరులను బీసీ–ఏ లో చేర్చాలి

17 Feb, 2018 03:55 IST|Sakshi

నేడు ఉప్పల్‌లో కుమ్మర బహిరంగ సభ: ఆర్‌.కృష్ణయ్య 

హైదరాబాద్‌: కుమ్మర కులస్తులను బీసీ–బి నుంచి ఏ లోకి మార్చాలని, ఇందుకు చట్టసభల్లో ఏకగ్రీవ తీర్మానం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బీసీ భవన్‌లో శుక్రవారం జరిగిన రాష్ట్ర కుమ్మర సంఘం సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొని మాట్లాడారు. కుమ్మరులను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. కులవృత్తిని కాపాడటంలో భాగంగా వారు చేసిన కుండలు, పూల కుండీలను ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు కొనుగోలు చేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కాకతీయ పనుల్లో వెలువడిన మట్టిని వారికి ఉచితంగా కేటాయించాలని, సహకార సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని కోరారు. 50 ఏళ్లు పైబడిన వారికి రూ. 2 వేల పింఛను ఇవ్వాలని, నామినేటెడ్‌ పదవుల్లో వారికి ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్‌ చేశారు. 

బహిరంగ సభ పోస్టర్‌ ఆవిష్కరణ: కుమ్మరుల డిమాండ్లపై శనివారం ఉప్పల్‌ జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌లో సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సభకు మంత్రులు ఈటల, జోగు రామన్న, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్, బీసీ కమిషన్‌ చైర్మన్‌ రాములుతో పాటుగా కమిషన్‌ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌రావు, బీసీ సంఘం నాయకులు గుజ్జకృష్ణ, భూపేశ్‌సాగర్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు