దీక్ష కొనసాగిస్తా: కూనంనేని

31 Oct, 2019 04:20 IST|Sakshi
కూనంనేని సాంబశివరావుని పరామర్శిస్తున్న కోదండరాం, మందకృష్ణ, చాడ, వీహెచ్, శ్రీనివాస్‌రెడ్డి

నిమ్స్‌లో 5వ రోజుకు చేరిన దీక్ష

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ పరిరక్షణతో పాటు, కార్మికుల న్యాయసమ్మతమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తన నిరవధిక దీక్ష కొనసాగిస్తానని సీపీఐ సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. సమ్మెపై జేఏసీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, వివిధ డిమాండ్లపై సానుకూల నిర్ణయం వెలువడే వరకు తన నిరసన దీక్ష కొనసాగుతుందని ‘సాక్షి’కి తెలిపారు. తన పల్స్‌రేట్‌ 53కు పడిపోయిందని, ఆరోగ్యం విషమిస్తోందని డాక్టర్లు హెచ్చరించారని పేర్కొన్నారు.

కోర్టు ఆదేశాలతోనైనా ప్రభుత్వం కదిలి ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వెంటనే పరిష్కారం సాధ్యం కాదని భావించే విషయాలపై కమిటీని ఏర్పాటుచేసి, పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కూనంనేని చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. నిమ్స్‌ ఆసుపత్రిలో కోదండరాం (టీజేఎస్‌), సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఈటీ నర్సింహ (సీపీఐ), మంద కృష్ణమాదిగ (ఎమ్మార్పీఎస్‌), వీహెచ్‌ (కాంగ్రెస్‌),  ఎల్‌.రమణ (టీటీడీపీ), రావుల చంద్రశేఖరరెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కూనంనేనిని పరామర్శించారు. 

మరిన్ని వార్తలు