హైకోర్టు న్యాయమూర్తిగా బోగారం వాసి 

25 Aug, 2019 10:48 IST|Sakshi

కృషి, పట్టుదలతో ఉన్నతస్థాయికి ఎదిగిన కూనూరు లక్ష్మణ్‌

యాదాద్రిభువనగిరి జిల్లాకు అరుదైన గౌరవం

సాక్షి, రామన్నపేట (నకిరేకల్‌) : యాదాద్రిభువనగిరి జిల్లాకు మరో అరుదైన గౌరవం దక్కింది. జిల్లాలోని రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన కూనూరు లక్ష్మణ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. వీరితోపాటు మరో ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రప్రతి రామ్‌నాథ్‌కోవింద్‌ ఈనెల 23న ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. 

బాల్యం–విద్యాభ్యాసం
రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన కూనూరు గోపాల్‌–సత్తెమ్మలది సామాన్య రైతు కుటుంబం. ఆ దంపతులకు శమంత, లక్ష్మణ్, మాధవి, భాస్కర్, అరుణ సంతానం. రెండవ సంతానమైన లక్ష్మణ్‌ 1966 జూన్‌ 2న తన అమ్మమ్మగారి ఊరైన ఇంద్రపాలనగరం(తుమ్మలగూడెం)లో జన్మించారు.   బోగారం ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి వరకు. రామన్నపేట ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో 10వ తరగతి వరకు, ఇంటర్‌ రామన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పూర్తిచేశారు.  ఆమీర్‌పేటలోని న్యూసైన్స్‌ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన లక్ష్మణ్‌ నెల్లూరు వీఆర్‌ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదివి పట్టా పొందారు. 1993లో న్యాయవాద వృత్తిని చేపట్టారు.

న్యాయవాదిగా రాణింపు
సీనియర్‌ న్యాయవాది ఎం.రాధాకృష్ణమూర్తివద్ద జూనియర్‌గా చేరి వృత్తికి సంబంధించిన మెళకువలను లక్ష్మణ్‌ నేర్చుకున్నారు. 1999 నుంచి సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించారు. కొద్దిరోజులకే మంచి న్యాయవాదిగా పేరు సంపాదించారు. యూరేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు న్యాయవాదిగా వ్యవహరించడంతోపాటు, సివిల్, లేబర్, రాజ్యాంగసంబంధ కేసుల్లో ప్రావీణ్యం సాధించారు. 2017లో అసిస్టెంట్‌ సోలిసిటర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు. ఆయనకు భార్య మంజుల, శ్రీజ, హిమజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కృష్ణాష్టమిరోజున జన్మించిన లక్ష్మణ్‌ అదే రోజునే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడం విశేషం.

గర్వంగా ఉంది
నా కుమారుడు అత్యున్నతమైన హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి చదువు మీదనే ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. ఆడంబరాలకు పోయేవాడు కాదు.  తాను ఏ  పనితలపెట్టినా పట్టుదలతో పూర్తిచేసేవాడు. వృత్తి నిర్వహణలో తీరిక దొరకక పోయినప్పటికీ మా యోగక్షేమాలు చూసుకోవడం మాత్రం మరచిపోడు. 
–గోపాల్‌–సత్తెమ్మ, న్యాయమూర్తి తల్లిదండ్రులు

మరిన్ని వార్తలు