కాసులు కురవవేం!

15 Jan, 2015 04:38 IST|Sakshi
కాసులు కురవవేం!

భూక్రమబద్ధీకరణకు స్పందన నామమాత్రమే.. మూడురోజుల్లో ముగియనున్న గడువు
 
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన భూక్రమబద్ధీకరణకు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ప్రభుత్వ స్థలంలో నివాసాలు ఏర్పర్చుకున్న వారికి.. ఆక్రమిత స్థలాన్ని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రభుత్వ ఖజానాను పరిపుష్టి చేసుకోవచ్చని భావించిన సర్కారు భూక్రమబద్ధీకరణకు తెరలేపింది. ఈమేరకు 2014 డిసెంబర్ 30న ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం.. ఈ నెల రెండోవారం నుంచి దరఖాస్తు ఫార్మాట్‌ను తయారుచేసి వాటి స్వీకరణకు ఉపక్రమించింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రానికి 67,294 దరఖాస్తులు రాగా, ప్రభుత్వ ఖజానాకు రూ.2.74కోట్లు మాత్రమే జమ అయ్యాయి.
 
ఉచితానికే ఊపు..
 భూక్రమబద్ధీకరణలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రకాల స్లాబులు పెట్టింది. 125 గజాలలోపు స్థలం ఆక్రమించిన వారికి ఉచితంగా క్రమబద్ధీకరించనున్నట్లు ప్రకటించింది.  125 నుంచి 250గజాలలోపు ఆక్రమించిన వారు రిజిస్ట్రేషన్ ధరలో 50 శాతం చెల్లించాలి. అదేవిధంగా 250-500గజాలలోపు వారు 75శాతం, 500 గజాలకు మించి ఆక్రమించిన వారు రిజిస్ట్రేషన్ ధరను చెల్లించాలని సూచించింది. ఇందులో భాగంగా దరఖాస్తు నమూనాను తయారు చేసి.. పూర్తిచేసిన దరఖాస్తులను ఈ నెల రెండో వారం నుంచి స్వీకరిస్తోంది.

ఈ నెల 13వతేదీ నాటికి 67,294 దరఖాస్తులు రెవెన్యూ అధికారులకు అందాయి. ఇందులో 67,003 దరఖాస్తులు ఉచిత క్రమబద్ధీకరణకు సంబంధించినవే. 125 గజాలకు మించి ఆక్రమించిన వాటిలో కేవలం 291 దరఖాస్తులు మాత్రమే కావడం గమనార్హం.

డివిజన్లవారీగా పరిశీలిస్తే చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో క్రమబద్ధీకరణ కోసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. వికారాబాద్ డివిజన్లో 125గజాలలోపు ఉన్న 5 దరఖాస్తులు అందాయి. అధికంగా మల్కాజిగిరి డివిజన్ నుంచి 43,303 దరఖాస్తులు, సరూర్‌నగర్ డివిజన్ నుంచి 6,846, రాజేంద్రనగర్ డివిజన్ నుంచి 17,140 దరఖాస్తులు వచ్చాయి.
 
18తో ముగియనున్న గడువు..
ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి దరఖాస్తు గడువు ఈ నెల 18తో ముగియనుంది. అయితే ఇప్పటివరకు 125గజాలకు మించిన కేటగిరీలో వచ్చిన దరఖాస్తులు 291 మాత్రమే ఉండడం యంత్రాగాన్ని ఆందోళనలో పడేసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఎక్కువ ఆక్రమణలు జిల్లాలోనే ఉండడంతో ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ ఆదాయం జిల్లానుంచే వస్తుందని సర్కారు అంచనావేసింది.

ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి ప్రధాన బాధ్యతలు అప్పగించినప్పటికీ.. అంచనాలు తలకిందులు కావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు మాట్లాడుతూ దరఖాస్తు గడువును పెంచాలని కోరారు.

కనిపించని హడావుడి..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూక్రమబద్ధీకరణపై జిల్లా యంత్రాంగం మాత్రం సాదాసీదాగా వ్యవహరిస్తోంది. ఎలాంటి ప్రచారార్భాటం లేకుండా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల స్వీకరణకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడంలో విఫలం కావడమో.. లేక ఆక్రమితులు క్రమబద్ధీకరణపై మక్కువ చూపడంలేకనో... దరఖాస్తుల సంఖ్య మాత్రం భారీగా తగ్గింది. జిల్లాలో రెండులక్షల ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇందులో ఉచిత కోటాలో 67,003 దరఖాస్తులు రాగా, చెల్లింపుల కోటాలో కేవలం 291 దరఖాస్తులు మాత్రమే అందాయి. వీటికి సంబంధించి డిమాండు డ్రాఫ్ట్(డీడీ)ల రూపంలో సర్కారు ఖజానాకు రూ.2,74,69,414 జమయ్యాయి. 2008లో అప్పటి ప్రభుత్వం అప్పటి రిజిస్ట్రేషన్ విలువతో చేపట్టిన క్రమబద్ధీకరణతో జిల్లా నుంచి రాష్ట్ర ఖజానాకు రూ.15 కోట్లు సమకూరాయి. ఈ క్రమంలో తాజాగా రిజిస్ట్రేషన్ల విలువ రెటింపును మించినప్పటికీ.. కాసులు కురవకపోవడం కొసమెరుపు.

 
 డివిజన్ల వారీగా వచ్చిన దరఖాస్తులు..
 డివిజన్                125             125 గజాలకు        ఆదాయం         
                           గజాలలోపు    పైబడినవి            (రూ.లలో)
 రాజేంద్రనగర్        17,107            33            79,16,793
 చేవెళ్ల                       0                0                   0
 వికారాబాద్              5                0                  0
 సరూర్‌నగర్        6,775            71            47,40,222
 మల్కాజిగిరి        43,116            187            1,48,12.399

మరిన్ని వార్తలు