కువైట్‌ అత్యవసర క్షమాభిక్ష

16 Apr, 2020 01:29 IST|Sakshi

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వలసదారుల భారం తగ్గించుకునేందుకే..

చట్ట విరుద్ధంగా ఉంటున్న విదేశీ కార్మికులను సాగనంపేందుకు ఏర్పాట్లు

జరిమానా లేకుండా వెసులుబాటు..విమాన చార్జీల చెల్లింపు.. 

ఒక్కో దేశ కార్మికులకు ఒక్కో టైమ్‌ షెడ్యూల్‌ ఖరారు

నేటి నుంచి 20 వరకు భారత కార్మికుల దరఖాస్తుల పరిశీలన

స్వదేశానికి రానున్నవేలాది మంది తెలుగు రాష్ట్రాల వలస జీవులు  

సాక్షి, హైదరాబాద్‌/ మోర్తాడ్‌: కరోనా విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు గల్ఫ్‌ దేశమైన కువైట్‌ వలస కార్మికుల భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. అక్రమ నివాసుల (ఖల్లివెళ్లి)పై ఇప్పటిదాకా చట్టపరమైన చర్యలు తీసుకున్న కువైట్‌... ఈసారి అత్యవసర క్షమాభిక్ష అమలు చేయడమే కాకుండా సొంత ఖర్చులతో వారిని భారత్‌కు తిప్పి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

నేటి నుంచి దరఖాస్తుల పరిశీలన..
విజిట్‌ వీసాలపై వచ్చి గడువు ముగిసినా ఏదో ఒక పని చేసుకోవడం, రెసిడెన్సీ పర్మిట్‌ గడువు ముగిసినా రెన్యువల్‌ చేసుకోకపోవడం, ఒక కంపెనీ వీసా పొంది మరో సంస్థలో చేరి చట్టవిరుద్ధంగా ఉంటున్న విదేశీ కార్మికులను వారి సొంత దేశాలు పంపేందుకు గల్ఫ్‌ దేశాలు క్షమాభిక్ష(ఆమ్నెస్టీ) అమలు చేస్తుండటం తెలిసిందే. 2018 జనవరిలో దీర్ఘకాలిక ఆమ్నెస్టీని అమలు చేసిన కువైట్‌ ప్రభుత్వం... ప్రస్తుతం కరోనా వైరస్‌ విస్తరిస్తున్న తరుణంలో అత్యవసర క్షమాభిక్షను తక్షణమే అమలులోకి తీసుకొచ్చింది. విదేశీ కార్మికుల సంఖ్యను వీలైనంత తగ్గించుకోవడం కోసమే అత్యవసర క్షమాభిక్షను కువైట్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో దేశానికి ఒక్కో టైమ్‌ షెడ్యూల్‌ ప్రకటించిన కువైట్‌.. భారత్‌కు సంబంధించిన కార్మికుల దరఖాస్తుల ప్రక్రియను గురువారం నుంచి మొదలుపెట్టనుంది. ఈ నెల 20 వరకు సూచించిన కేంద్రంలో క్షమాభిక్ష దరఖాస్తులు సమర్పించే వారికి కువైట్‌ సర్కారు ఔట్‌పాస్‌లు జారీ చేయనుంది.

ఉచితంగా బస, విమాన చార్జీలు..
అత్యవసర క్షమాభిక్షకు సమయం ఖరారు చేసిన కువైట్‌ సర్కారు... అక్రమ వలస కార్మికులపట్ల ఉదారంగా వ్యవహరించాలని నిర్ణయించింది. వీసా, రెసిడెన్సీ పర్మిట్‌ గడువు, ఖల్లివెల్లి కార్మికులు ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించింది. అలాగే మునుపెన్నడూ లేనివిధంగా వలస కార్మికులను స్వదేశాలకు పంపేందుకు విమాన చార్జీలను సైతం భరించనున్నట్లు ప్రకటించింది. మరో విశేషమేమిటంటే లాక్‌డౌన్‌ కారణంగా ఆనేక దేశాలు అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఈ సేవలు పునరుద్ధరణ జరిగే వరకు స్వదేశానికి వెళ్లేందుకు లైన్‌ క్లియరైన వలస కార్మికులను ప్రత్యేక శిబిరాలకు తరలించాలని కువైట్‌ ప్రభుత్వం నిర్ణయించింది. శిబిరాల నిర్వహణ ఖర్చును కూడా భరించనుంది.

తక్కువ సమయం... ఎక్కువ మంది.
కువైట్‌లో చట్టవిరుద్ధంగా ఉంటున్న కార్మికుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 3 వేల మంది వరకు ఉంటారని అంచనా. అయితే భారతీయ కార్మికులకు ఐదు రోజులపాటే క్షమాభిక్ష దరఖాస్తుల పరిశీలనకు కువైట్‌ ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్వల్ప వ్యవధిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి కాదని అందువల్ల గడువు పెంచాలని వలసదారులు కోరుతున్నారు.

లాక్‌డౌన్‌తో అందరికీ అందని దరఖాస్తులు
కరోనా కట్టడి కోసం కువైట్‌లోనూ లాక్‌డౌన్‌ అమలవుతోంది. లాక్‌డౌన్‌ వల్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. ఈ పరిస్థితుల్లో చట్టవిరుద్దంగా ఉన్న మన కార్మికులందరికీ దరఖాస్తులు అందించడం సాధ్యం కావట్లేదని స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. రెడ్‌జోన్‌ ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాలు, గొర్రెలు, మేకల షెడ్‌లలో పనిచేసే వలస కార్మికులకు క్షమాభిక్ష దరఖాస్తులను అందించడం ఇబ్బందిగా ఉందని వాలంటీర్లు తెలిపారు. అందువల్ల భారత విదేశాంగశాఖ అధికారులు చొరవ తీసుకొని ఆమ్నెస్టీ గడువు పెంచేలా కువైట్‌ ప్రభుత్వంతో చర్చలు జరపాలని పలువురు కోరుతున్నారు.

దరఖాస్తులు అందించడం ఇబ్బందిగా ఉంది
కువైట్‌లో లాక్‌డౌన్‌ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా ఉన్న మన కార్మికులందరికీ క్షమాభిక్ష దరఖాస్తులు అందించడం ఇబ్బందిగా ఉంది. వాలంటీర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆమ్నెస్టీ దరఖాస్తులను కార్మికులకు చేర్చడం సాధ్యం కావట్లేదు. లాక్‌డౌన్‌ వల్ల ఏర్పడిన ఇబ్బందులను గుర్తించి క్షమాభిక్ష గడువు పెంచాల్సిన అవసరం ఉంది.
– ప్రమోద్‌ కుమార్, ఆమ్నెస్టీ వాలంటీర్, కువైట్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు