ఉచితం అని చెప్పి పెయిడ్‌ క్వారంటైన్‌కా..? 

12 May, 2020 03:39 IST|Sakshi

కువైట్‌ నుంచి వచ్చిన వలస కార్మికుల ఆవేదన 

మోర్తాడ్‌ (బాల్కొండ): గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే వలస కార్మికుల్లో పేద వారికి ఉచిత క్వారంటైన్‌ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన మాటలకే పరిమితమైంది. శనివారం రాత్రి కువైట్‌ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన తొమ్మిది మంది వలస కార్మికులు ఉండగా వారిని అధికార యంత్రాంగం క్వారంటైన్‌ కోసం ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించింది. అయితే క్వారంటైన్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, రూ.15 వేలు, రూ.30 వేల ప్యాకేజీలను ప్రకటించింది. అంతలోనే రూ.5 వేల ప్యాకేజీని ప్రభుత్వం ఎత్తివేసింది. కేవలం రెండు రకాల ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది. అలాగే పేద కార్మికులు ఎవరైనా ఉంటే వారికి ఉచిత క్వారంటైన్‌కు తరలిస్తామని ప్రభుత్వం వివరించింది. కువైట్‌ నుంచి వచ్చిన 163 మందిలో వలస కార్మికులైన తొమ్మిది మంది ఉచిత క్వారంటైన్‌కు వెళ్లడానికి ఆప్షన్‌ ఇచ్చారు. కానీ హోటల్‌ నిర్వాహకులు వలస కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఉచిత క్వారంటైన్‌ అని భావించిన వలస కార్మికులు అవాక్కయ్యారు.   

మరిన్ని వార్తలు