వలస కూలీలకు తప్పని తిప్పలు

16 Nov, 2016 00:33 IST|Sakshi
వలస కూలీలకు తప్పని తిప్పలు

ముంబైలో పనుల కోసం వెళ్లిన రాష్ట్ర కూలీల అవస్థలు
- పనుల్లేవు.. చేతుల్లో డబ్బుల్లేవు
- పని దొరికినా ఇస్తున్నది పాత నోట్లే
- వాటిని మార్చుకునేందుకు మరిన్ని కష్టాలు
- రెక్కల కష్టం కమీషన్ల పాలు
- తిరిగి స్వగ్రామానికీ వెళ్లలేని దుస్థితి  
 
 సాక్షి, ముంబై: రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితిలో పొట్టచేతబట్టుకుని ముంబైకి వలస వెళ్లిన రాష్ట్ర కూలీలను ‘నోటు’ కష్టాలు చుట్టుముట్టారుు. చేద్దామంటే పనుల్లేవు.. కొందరు పనులకు తీసుకెళుతున్నా పాత పెద్ద నోట్లే ఇస్తున్నారు.. అవి చెల్లవు.. చేతుల్లో చిల్లర డబ్బుల్లేవు.. చిల్లర కోసం ప్రయత్నిస్తే రెక్కల కష్టం కమీషన్ల పాలవుతోంది.. తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోదామన్నా కష్టమైన పరిస్థితి.

 తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ముంబైతోపాటు చుట్టపక్కల ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు నోట్ల రద్దుతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చేతిలో డబ్బులున్నప్పటికీ పస్తులుండాల్సిన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును కమీషన్ల పాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూలీలు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణ పనులు నిలిచిపోవడంతో.. కూలీ పని దొరకడం లేదు. గంటల తరబడి నాకాల వద్ద ఎదురుచూసి, ఇళ్లకు తిరిగి వెళుతున్నారు. కొందరు పనులకు పిలుస్తున్నా.. కూలీ కింద పాత పెద్ద నోట్లు ఇస్తుండడంతో పనులకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ముఖ్యంగా ముంబైలోని చెంబూర్, మలాడ్, బాంద్రా, వాషి, ఠాణేలోని కల్వా, కిసన్‌నగర్, జాంబ్లీ, శాస్త్రినగర్.. ఇలా దాదాపు అన్ని చోట్లా వలస కూలీల పరిస్థితి ఇలాగే ఉంది. కొందరు ప్రతిరోజూ ఒకే వ్యక్తికి సంబంధించిన పనులకు వెళ్తుండడంతో.. వారికి మాత్రం రోజూ భోజనం, ప్రయాణం కోసం అయ్యే ఖర్చులను ఇస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, చేతిలో డబ్బులున్నా పస్తులుండాల్సిన పరిస్థితి కనిపిస్తోందని వలస కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఉపవాసం ఉండాల్సి వస్తుందేమో!
 ‘‘పనుల్లేవు, దగ్గరున్న పైసలు అరుుపోతున్నారుు. ఏం చెయ్యాలో అర్థమైతలేదు. రూ.500 నోటిస్తే ఎవరూ తీసుకుంటలేరు. గంటల కొద్ది నిలబడ్డా పనులకు తీసుకపోయేందుకు ఎవరూ రావట్లేదు. గిట్లనే అరుుతే చేతిలో ఉన్న చిల్లర పైసలు అరుుపోరుు ఉపవాసం ఉండాల్సివస్తోందేమో..’’
 - రోక్యా రాథోడ్ (మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్)
 
 చాలా కష్టమైతున్నది..
 ‘‘రెండు రోజుల నుంచి ఖాళీగానే ఉంటున్న. గిట్ల ఒక్కసారిగా పెద్ద నోట్లను బందు చేసిండ్రు. చాల కష్టమైతుంది. రోజు ఖర్చులు వెల్లదీసేందుకు ఇబ్బంది అవుతోంది..’’
 - దుర్గవ్వ (నిజామాబాద్ జిల్లా బాల్కొండ)
 
 రెక్కల కష్టం కమీషన్ పాలవుతోంది
 ‘‘పనులకు పోతే పెద్ద నోట్లే ఇస్తున్నరు. ఆ నోట్లు మార్చేందుకు పోతే పెద్ద పెద్ద లైన్లు ఉంటున్నారుు. రోజు ఖర్చుల కోసం చేసేదేం లేక కిరాణా దుకాణంలో రూ.500 నోటుకు రూ.100 కమీషన్ ఇచ్చి మార్చుకుంటున్న. అది కూడా  ఏదైనా కొంటేనే చిల్లర ఇస్తున్నరు. రెక్కల కష్టం కమీషన్‌కు ఇవ్వాల్సి వస్తోంది..’’
 - బోయన ఎల్లయ్య (కరీంనగర్ జిల్లా నవపేట)
 
 పిల్లలకు ఫోన్ కూడా చేయలేకపోతున్నా..
 ‘‘పాత నోట్ల రద్దుతో ఊళ్లోని భార్య, పిల్లలకు ఫోన్ కూడా చేసి మాట్లాడలేని పరిస్థితి. పనుల్లేవు, చేతిలోని చిల్లర అరుుపోయారుు. పాత నోట్లను మార్చుకోవాలంటే ఓ రోజంతా లైన్‌లో నిలబడాల్సిందే. ఫోన్లో రూ.50 రీచార్జి చేసుకునేందుకు రూ.500 పాత నోటు ఇస్తే.. రీచార్జి సొమ్ము, కమీషన్ తీసుకుని రూ.350 తిరిగిస్తున్నారు..’’
 - చెంచాల యాదగిరి (సిద్దిపేట జిల్లా గౌరయ్యపల్లి)
 
 పనిబందు పెట్టిన..
 ‘‘ఒక్కసారిగా రూ.500, 1,000 నోట్లను బందు చేసిండ్రు. పనికాడికి వెళితే వాళ్లు పెద్ద నోట్లే ఇస్తున్నరు. మా తోటి కూలీలెవరూ పెద్ద నోట్లు తీసుకుంటలేరు. చేసేదేం లేక రెండు రోజుల నుంచి పని బందుపెట్టిన..’’
 - కుడుం సంగీత (రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి)

>
మరిన్ని వార్తలు