సాగుకు కొత్త సమస్య

12 Jul, 2014 00:11 IST|Sakshi

 యాచారం: ఇన్నాళ్లు వర్షాలు లేక ఆందోళనకు గురైన రైతన్నను ఊరడిస్తూ వరుణుడు కాస్త కరుణించాడు. అడపాదడపా పడుతున్న వర్షాలకు సాగు కోసం రైతులు పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వారికి మళ్లీ ఇప్పుడుయచ కొత్త సమస్య వచ్చి పడింది.

 నెల రోజుల ఎదురు చూపుల తర్వాత ఇటీవలె వర్షాలు కురిశాయి. దీంతో రైతులంతా ఒక్కసారిగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కొన్ని గ్రామాల్లో మెట్ట పంటలు వేసుకుంటుండగా మరికొన్ని గ్రామాల్లో వరి నాట్లు వేస్తున్నారు. అయితే అన్ని గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకోవడంతో కూలీల సమస్య తీవ్రంగా మారింది. ఒకవైపు ఉపాధి పనులు కొనసాగుతుండటం, ఒకేసారి అందరికీ అవసరం పడటంతో కూలీలకు తీవ్ర కొరత వచ్చి పడింది. దీంతో కూలి ధరలు అమాంతం పెరిగిపోయాయి.

 అంతేకాకుండా కూలీలు కూడా ఉదయం పూట ఉపాధి పనులకు వెళ్లి మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో రైతుల వద్ద వ్యవసాయ పనులకు వెళ్లుతున్నారు. అంతేకాకుండా రోజుకు రూ. 300కు పైగా కూలిని డిమాండ్ చేస్తుండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. దీనికితోడు కూలీ నాగలితో వస్తే రోజుకు రూ. వెయ్యి వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో కొందరు యం త్రాల సహాయంతో పనులు చేసుకుంటుండగా మరికొందరు కూలీలపైన ఆధారపడక తప్పడం లేదు.

 కొందరు కూలీలకు  ముందే అడ్వాన్సులు ఇచ్చి వ్యవసాయ పనులు చేయించుకుంటున్నారు. కొందరు కూలీలు వ్యవసాయ పనులను గుత్తకు తీసుకొని పూర్తి చేస్తున్నారు. తాడిపర్తి, నానక్‌నగర్, తక్కళ్లపల్లి, చింతపట్ల తదితర గ్రామాల్లో వరి నాట్ల పనులు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయ పనులు జరిగి నన్ని రోజులు అధికారులు ఉపాధి పనులు నిలిపివేయాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు