నెగెటివా.. పాజిటివా?

10 Jul, 2020 03:51 IST|Sakshi

శంకర్‌(పేరు మార్చాం) తమ్ముడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో తనతోపాటు కుటుంబంలోని మొత్తం ఆరుగురూ ఈ నెల 3న హైదరాబాద్‌లోని ఒక ప్రభుత్వాసుపత్రిలో స్వాబ్‌ నమూనాలు ఇచ్చారు. ఇచ్చిన ఐదు రోజులకు ఆరుగురులో ఇద్దరికి పాజిటివ్‌ అని చెప్పారు.. ఆరో రోజున మిగిలిన నలుగురివీ నెగెటివ్‌ అని చెప్పారు. ఏడో రోజుకు మళ్లీ పరిస్థితి మారింది.. నెగెటివ్‌ అన్న నలుగురిలో ఇద్దరు మాత్రమే నెగెటివ్‌ అని.. ఒకరు పాజిటివ్‌ అని సవరణ చేశారు. ఇంకొకరి రిపోర్టు వారం దాటినా రానే లేదు.   

ఈ కన్ఫ్యూజన్‌ ఇలా ఉంటే.. రాజారాం (పేరు మార్చాం) అనే ఆయన ఈ నెల 4న హైదరాబాద్‌లోని ఒక ప్రభుత్వాసుపత్రిలో నమూనాలు ఇచ్చారు. ఈరోజు వరకూ ఆసుపత్రి వర్గాల నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. పాజిటివా, నెగెటివా అన్న వివరాలు కూడా ఇవ్వలేదు. 104కు ఫోన్‌ చేస్తే తమకు తెలియదన్నారు. నమూనాలు ఇచ్చిన ఆసుపత్రిలో అడిగితే ఇక్కడ పరీక్షలు చేయరని చెబుతున్నారు. ఎవరిని అడిగితే విషయం తెలుస్తుందో కూడా తెలియదు. దీంతో ఆ కుటుంబం వైద్య, ఆరోగ్యశాఖ వర్గా లకు చెందిన అధికారుల వద్దకు వెళ్లినా ఇంకా రిపోర్టులు రాలేదన్న సమాచారమే వచ్చింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.

ఇలా రాష్ట్రంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు లేబొరేటరీల్లో కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాల వెల్లడి ఆలస్యమవుతోంది. అనేకమందికి వారంరోజులైనా స్పష్టత రావడం లేదు. ఫలితాలెప్పుడు వస్తాయోనన్న విషయంలో కూడా స్పష్టతలేదని బాధితులు విచారం వ్యక్తం చేశారు. వివరాల కోసం ఎవరెవరికో ఫోన్లు చేయాల్సిన దుస్థితి. పాజిటివ్‌ వచ్చినవారికే ఫోన్లు చేస్తున్నారు. నెగెటివ్‌ అయితే సమాచారం ఇవ్వడంలేదు. దీంతో నెగెటివ్‌ వచ్చిందా, పాజిటివ్‌ వచ్చిందా అనే విషయం తెలియక వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని లేబొరేటరీల్లో భారీగా నమూనాలు పేరుకుపోవడం, పరీక్షల వివరాలను అప్‌లోడ్‌ చేయడంలో ఆలస్యం వల్ల ఫలితాలు జాప్యమవుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి చెప్పా రు. ప్రైవేటు లేబొరేటరీల్లోనూ పరిస్థితి అలాగే ఉందని, ఫలితాలను ఐసీఎంఆర్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి రావడంతో ఆలస్యం అవుతోందని ఓ లేబొరేటరీ యాజమాన్యం పేర్కొంది.

సీరియస్‌ రోగుల పరిస్థితి ఏంటి?  
కరోనా నిర్ధారణ పరీక్షలు ఆలస్యం కావడం వల్ల సీరియస్‌ రోగుల పరిస్థితి విషమంగా మారుతోంది. ఒక్కోసారి ప్రాణాపాయస్థితికి చేరుకుంటోంది. ఐదారు గంటల్లో ఫలితం ఇవ్వాలి. కానీ, ఐదారు రోజులు, వారం ఆలస్యమైతే పరిస్థితి చేయిదాటి పోతుంది. సీరియస్‌గా ఉన్నవారి పరిస్థితికి బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి తక్షణమే ఫలితం తెలిస్తే అతనికి వైద్యం చేయడానికి వీలు కలుగుతుందని, లేకుంటే అది ముదిరి ఇతర కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అంటించే అవకాశం కూడా ఉందంటున్నారు. దీనివల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదమూ ఉందని భయాందోళన చెందుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన రోగులకు ఫోన్లు చేస్తున్నారే కానీ ఎటువంటి వైద్యసాయం, సలహాలు అందివ్వడంలేదని శంకర్‌ అనే బాధితుడు విచారం వ్యక్తం చేశారు. పరిస్థితి సీరియస్‌ అయితే పట్టించుకునేనాథుడే లేడంటున్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో సమన్వయలోపం  
కరోనా నిర్ధారణ కోసం లేబొరేటరీల్లో నమూనాలు తీసుకున్నాక వాటిని సకాలంలో పరీక్షించడం, తదుపరి ఐసీఎంఆర్‌ పోర్టల్‌ లోనూ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోర్టల్‌లోనూ అప్‌ లోడ్‌ చేస్తారు. ప్రతీ లేబొరేటరీకి ఒక అధిపతి ఉంటారు. వాటన్నింటినీ పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో ఒకరు పర్యవేక్షణ చేస్తారు. అన్ని లేబొరేటరీల నుంచి ఫలితాల వివరాలను తెప్పించి అప్‌లోడ్‌ చేయించడం అతని బాధ్యత. అయితే ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది. అక్కడి నుంచి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాక వాటిని మరో విభాగాధిపతి ప్రజలకు తెలియజేస్తారు. ఈ రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో బాధితులకు తీవ్రమైన అన్యా యం జరుగుతోంది. వాటిని సరిదిద్దాల్సిన ఉన్నతస్థాయి వైద్య, ఆరోగ్య యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉందన్న భావన నెలకొంది. అసలు పనిచేయించుకోనీయకుండా సమావేశాల పేరుతో టైం వేస్ట్‌ చేయిస్తున్నారని ఒక ఉన్నతాధికారి వాపోయారు.

మరిన్ని వార్తలు