ఎవరి తోవ వారిదే..!

14 Nov, 2018 17:42 IST|Sakshi

కలిసి రాని కమలనాథులు

సయోధ్యకు వెంకట్‌ యత్నాలు

కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి

కోరుట్ల: కమలంలో ఎవరి తోవ వారిదే.. నేతలంతా కలిసిరావడంలో జరుగుతున్న జాప్యం పార్టీ ప్రచార పర్వంలో ఇబ్బందులకు కారణమవుతోంది. కోరుట్ల సెగ్మెంట్‌ అభ్యర్థి ఖరారుకు ముందుగానే ఉన్న గ్రూపుల పోరు యథావిధిగా కొనసాగుతోంది. పార్టీలోని అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కొత్తగా పార్టీలో చేరి టికెట్‌ సాధించిన జేఎన్‌ వెంకట్‌ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  పార్టీలోని అందరు కీలక నేతలను ప్రసన్నం చేసుకోడానికి అభ్యర్థి జేఎన్‌ వెంకట్‌ పార్టీ అధిష్టాన నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. 

ఎవరి గ్రూపు వారిదే..
కోరుట్ల సెగ్మెంట్‌లో బీజేపీ అభ్యర్థిత్వం ఖరారుకు ముందే గ్రూపులు ఉండటం గమనార్హం. సెగ్మెంట్‌లో కీలకమైన కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో కొంత మంది నేతలు ఎవరి తోవ వారిదే అన్న చందంగా వ్యవహరించడం పార్టీకి సమస్యాత్మకంగా మారింది. కోరుట్ల బీజేపీలో నాలుగు గ్రూపులు ఉండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి వీరంతా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించేవారే కావడం గమనార్హం. మెట్‌పల్లిలోనూ ఆది నుంచి ఇదే తీరుగా గ్రూపులు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 

ఎవరికి వారు పార్టీ అభ్యర్థి వెంకట్‌ ప్రచారపర్వంలో పాల్గొంటున్నప్పటికీ లోలోన మాత్రం స్థానిక నేతలతో ఉన్న విజేఎన్‌ వెంకట్‌ విభేదాలను గుర్తు తెచ్చుకుని కలిసి పనిచేయడానికి వెనకాముందాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెగ్మెంట్‌లోని అన్ని గ్రామాల్లో పార్టీకి  కార్యకర్తలు..బీజేపీ అనుబంధ విబాగాలు.. ఓటు బ్యాంకు బలంగా ఉన్నప్పటికి కీలక నేతలు కలసి కష్టపడితే మంచి పలితాలు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

సయోధ్యకు యత్నాలు...
కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలోకి చేరి టికెట్‌ సాధించిన జేఎన్‌ వెంకట్‌ పార్టీలోని అన్ని గ్రూపులను కలుపుకుని పోయేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ దిశలో వెంకట్‌ మెల్లమెల్లగా పావులు కదుపుతున్నారు. కొంత మంది కీలక నేతల వద్దకు తానే వెళ్లి స్వయంగా కలుస్తున్నారు. మరి కొంత మంది నేతలకు అధిష్టాన నాయకులతో ఫోన్లు చేయించి బుజ్జగింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొంత మంది పార్టీ నాయకులు మెత్తబడినట్లు సమాచారం.

మరో రెండు రోజుల్లో బీజేపీ నుంచి నామినేషన్‌ వేయనున్న నేపథ్యంలో అన్ని వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకురావాలన్న లక్ష్యంతో వెంకట్‌ యథాశక్తి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పార్టీ నాయకులను కలుపుకు పోయే యత్నాలతో పాటు స్వంతంగా తన సామాజిక వర్గం..అనుచరవర్గం అండతో ఇప్పటికే సెగ్మెంట్‌లోని అనేక గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ నేతలంతా కలిసి కదిలితే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  
 

మరిన్ని వార్తలు