పనిభారం.. పర్యవేక్షణ లోపం

3 Dec, 2019 08:25 IST|Sakshi

 గ్రామ పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యం

నాలుగైదు గ్రామాలకో పోలీస్‌ అధికారి

ఏడాదికి పైగా కదలికలు లేని వీపీవోలు

పనిభారం, సిబ్బంది కొరతే కారణం 

రాయికల్‌ మండలంలో 32 గ్రామాలుండగా ఒక్కో పోలీస్‌ కానిస్టేబుల్‌కు నాలుగేసి గ్రామాల బాధ్యతలు అప్పగించారు. స్టేషన్‌లో ఒక ఎస్సై, ఏఎస్సై, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ఉండగా ఏఎస్సైకి రాయికల్‌ మున్సిపాలిటీ అప్పగించారు. మిగతా సిబ్బందిలో ఒక్కొక్కరికీ నాలుగేసి గ్రామాల బాధ్యతలు ఉండడంతో పర్యవేక్షణ కరువైంది 

సాక్షి, జగిత్యాల : పల్లెలపై పోలీసులకు పట్టు సడలిపోతోంది. ఠాణాల్లో సరైన సంఖ్యలో సిబ్బంది లేకపోవడం, ఉన్నవారిపైనే పనిభారం పడుతుండడంతో గ్రామాలపై దృష్టి కేంద్రీకరించడం లేదు. ఒక్కో పోలీసుకానిస్టేబుల్‌కు మూడు నుంచి నాలుగు గ్రామాల బాధ్యతలు ఉంటుండడంతో ఏ ఒక్క గ్రామంపై పట్టు సాధించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో పోకిరీల బెడద ఎక్కువైపోతుంది. గ్రామాలపై పర్యవేక్షణకు  ఏర్పాటు చేసిన  విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ వ్యవస్థ ని నిర్వీర్యమవుతోంది. ఫలితంగా గ్రామాల్లో దొంగతనాలు, దోపిడీలు, ఉత్సవాల సమయంలో గొడవలు సర్వసాధారణమయ్యాయి. హైదరాబాద్‌లో దిశ అత్యాచారం, హత్య కేసు గ్రామస్థాయిలో పోలీస్‌ వ్యవస్థ పనితీరుపై చర్చలేపింది.  

వీపీవో నిర్వీర్యం 
గ్రామస్థాయిలో పలుశాఖలతో పాటు కీలకమైన పోలీస్‌శాఖ అధికారిగా వీపీవోలను కేటాయిస్తుంది. గ్రామానికో పోలీస్‌ అధికారి ఉంటే విధిగా తమ గ్రామాల్లో కొంత సమయం కేటాయించే అవకాశం ఉంటుంది. ఎన్నికలు, పండుగలు, జాతర సమయాల్లో వీరు గ్రామాల్లో శాం తిభద్రతలను పర్యవేక్షిస్తారు. సిబ్బంది కొరతతో జిల్లాలో వీపీవో వ్యవస్థ నిరీ్వర్యమవుతోం ది. జిల్లాలో 380 గ్రామపంచాయతీలతోపాటు 103 పల్లెలను కలుపుకొని నాలుగు గ్రామాలకు ఒక వీపీవో ఉండగా వారి పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్‌ సిబ్బంది సంఖ్య పెరగకపోవడం సమస్యగా మారింది. సిబ్బంది తక్కువగా ఉండడం, సెలవులు లేకపోవడంతో శాంతిభద్రతల పర్యవేక్షణపై ప్రభావం చూపుతోంది. పోలీసు సిబ్బందికి ఆర్టీసీ సమ్మెకాలం నుంచి ఇప్పటి వరకు సెలవులు మంజూరుచేయడం లేదు. ఉన్న సిబ్బందిపైనే అదనపు పనిభారం పడుతోంది. కోర్టు డ్యూటీలు, రిసిప్షన్‌ విభాగాలకు పోనూ రక్షణ బాధ్యతలు నిర్వర్తించేందుకు అతి కొద్ది మందే మిగులుతున్నారు.  

రెచ్చిపోతున్న పోకిరీలు, అక్రమ వ్యాపారులు 
గ్రామాల్లో పోలీసుల పర్యవేక్షణ కరువవడంతో పోకిరీలు రెచి్చపోతున్నారు. గుట్కా, గంజాయి స్మగ్లర్లు సైతం ఇటీవల జిల్లాలోని మారుమూల ప్రాంతాలే లక్ష్యంగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇటీవల నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి గుట్కా, గంజాయి వ్యాపారులు జిల్లాలోని మారుమూల గ్రామాలకు వచ్చి గంజాయి విక్రయిస్తున్న సంఘటనలు వెలుగుచూశాయి. అంతేకాకుండా హుక్కా కోసం యువకులు గ్రామ శివారు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటికీ పోలీస్‌ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడమని అర్థమవుతుంది.  
► మేడిపెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఒక ఎస్సైతోపాటు ఇద్దరు ఏఎస్సైలు, ఒక హెడ్‌ కానిస్టేబుల్, 11 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులోనూ ఒక ఏఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లను డిప్యూటేషన్‌పై అటాచ్‌ చేశారు. దీంతో స్టేషన్‌లో పోలీసులే కరువయ్యారు. దీంతో వీపీవోలు గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదు.  
►  కొడిమ్యాల పీఎస్‌లో ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, నలుగురు హెడ్‌కానిస్టేబుల్లు, 21 మంది పీసీలు పనిచేయాల్సి ఉండగా..  రెండు హెడ్‌కానిస్టేబుళ్లు, ఆరు కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండలంలో ఉన్న  24 గ్రామాలకుగానూ 13 గ్రామాలకు మాత్రమే వీపీవోలు ఉన్నారు. మిగతా గ్రామాల్లోని శాంతిభద్రతల పరిస్థితిని ఇన్‌ఛార్జి వీపీవోలు చూసుకుంటున్నారు. 
►  కథలాపూర్‌ మండలంలో 19 గ్రామాలుండగా మూడు గ్రామాలకు కలిపి ఒక వీపీవోను నియమించారు. ఇక్కడ పోలీస్‌ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఠాణాలో 30 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లకు గాను నలుగురు మాత్రమే ఉన్నారు. మూడు ఏఎస్సై పోస్టులకు గాను ముగ్గురు ఉన్నా, ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లకు ఇద్దరే ఉన్నారు. 
► సారంగాపూర్‌ మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. మండల ఠాణాలో ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 22 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించాలి. కానీ ప్రస్తుతం ఎస్సై, ఏఎస్సై, ఒక హెడ్‌కానిస్టేబుల్‌తోపాటు 15 మంది కానిస్టేబుళ్లు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ప్రస్తుతం నలుగురు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. ఇందులో ఒకరు కరీంనగర్, ఇంకొకరు జగిత్యాల కోర్టు కానిస్టేబుల్, మరొకరు రైటర్‌గా పనిచేస్తుండగా, ఒకరు మాత్రమే స్టేషన్‌లో ఉంటున్నారు. మిగిలిన వారు వేర్వేరు చోట్ల డెప్యూటేషన్‌లపై విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న వారిపైన అదనపు బాధ్యతలు పడడంతోపాటు వారికే మూడు, నాలుగు గ్రామాల బాధ్యతలు అప్పగిస్తున్నారు.   

వీపీవోలను పునరుద్ధరిస్తాం  
జిల్లాలోని పోలీస్‌ సిబ్బంది బదిలీలతో విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. పెరిగిన గ్రామపంచాయతీలకు అనుగుణంగా వీపీవోలను కేటాయిస్తాం. త్వరలోనే మళ్లీ వీపీవోల వ్యవస్థను పునరుద్ధరిస్తాం.   
దక్షిణమూర్తి, అడిషనల్‌ ఎస్పీ, జగిత్యాల 

మరిన్ని వార్తలు