యాదాద్రి లడ్డూలకు బూజు

7 Oct, 2018 01:45 IST|Sakshi

గాలి ఆడని కౌంటర్లలో నిల్వ

3 వేల లడ్డూలకు బూజు రావడంతో పెంటపాలు

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి వచ్చే భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదానికి బూజు పట్టింది. భక్తులకు పంపిణీ చేసేందుకు కౌంటర్‌లో ఉంచిన సుమారు 3 వేల లడ్డూలకు ఫంగస్‌ రావడంతో దేవస్థానం అధికారులు శనివారం వాటిని పారబోయించారు. ప్రసాద విక్రయశాలకు చెందిన అధికారులు తయారైన లడ్డూలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి కౌంటర్‌లకు పంపుతున్నా కౌంటర్‌లలో గాలి ఆడక, వేడి వాతావరణంతో పాడవుతున్నాయి. ఒకే సారి పెద్ద మొత్తంలో తయారు చేయించడం, స్టాక్‌ ఉంచడంతో అవి బూజు పట్టి వృథా అవుతున్నాయని అంటున్నారు.  

ఎందుకు పాడవుతున్నాయంటే..: తయారు చేసిన లడ్డూలను గాలికి ఆరబెట్టడం, లేదా చల్లని ప్రదేశాల్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కానీ, దేవస్థానం అధికారులు ఇష్టానుసారం లడ్డూలను పంపడం, కౌంటర్లలో వేడివాతావరణం మధ్య అలాగే వదిలేస్తుండటంతో తొందరగా బూజు వచ్చి పాడవుతున్నాయి.  

ఇనుప రేకుల కౌంటర్ల వల్లే..
యాదాద్రి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఇటీవల బాలాలయం పక్కన ఉన్న ప్రసాద విక్రయశాలను కూల్చివేశారు. కొత్తగా ఇనుప రేకులతో తయారు చేసిన కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో సరైన గాలి ఆడక, మధ్యాహ్నం సమయానికి ఎండ తీవ్రతకు వేడి అధికంగా ఉంటోంది. దీంతో లడ్డూలకు బూజు వచ్చినట్లు కౌంటర్‌ సిబ్బంది అంటున్నారు. కాగా, కౌంటర్లలోని లడ్డూలకు బూజు పట్టినమాట వాస్తవమేని ప్రసాద విక్రయశాల సూపరింటెండెంట్‌ విజయకుమార్‌ అన్నారు. లడ్డూలు పాడుకాకుండా  కౌంటర్లలో ఏసీలు అమర్చుతామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు