యానం మాయగాడు అరెస్ట్‌..!

3 Jul, 2019 07:33 IST|Sakshi
మాట్లాడుతున్న డీఎస్పీ నాగేశ్వర్‌రావు

సాక్షి, సూర్యాపేట క్రైం : మాయ మాటలతో సోషల్‌ మీడియా వేదికగా అమ్మాయిలకు చేరువై అనంతరం బ్లాక్‌ మెయిల్‌ చేసి అందిన కాడికి దండుకునే యానం మాయగాడిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్‌రావు కేసు వివరాలు వెల్లడించారు. యానం పట్టణానికి చెందిన కర్రీ సతీష్‌ (25) అక్కడే నత్త గుల్లల, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోషల్‌ మీడియా ద్వారా అమాయకులైన అమ్మాయిలను ప్రేమవలలో దించి వారి నుంచి డబ్బులు లాగడం ప్రవృత్తి. దీనిలో భాగంగా సతీష్‌ హైదరాబాద్‌ ఇన్‌స్ట్రాగాం యాప్‌లో సూర్యాపేట పట్టణం తాళ్లగడ్డకు చెందిన ఓ యువతిలో పరిచయం పెంచుకున్నాడు.

వివాహం చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు. వ్యాపార అవసరాలను డబ్బులు కావాలని యువతికి మాయమాటలు చెప్పి డబ్బు ఏర్పాటు చేయవలసిందిగా ఒత్తిడి తెచ్చాడు. ప్రియుడి మాటలు నమ్మిన ఆ యువతి తాత చిదుముల్లి భిక్షంరెడ్డి ఇంట్లోలేని సమయంలో అతనితో కలిసి బీరువాలో ఉన్న 24 తులాల బంగారు నగదు చోరీ చేసి ప్రియుడికి ఇచ్చింది. విషయం తెలియని భిక్షంరెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తరువాత యువతి ప్రియుడిని నగలు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరగా, సతీష్‌ బంగారము అడిగితే వ్యక్తిగత ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడు. యవతి తాతతో కలిసి పోలీసులకు విషయం వివరించగా ఆ సమాచారం మేరకు ఇన్‌స్పెక్టర్‌ కె.శివశంకర్, కానిస్టేబ్‌లు గొర్ల కృష్ణ, గోదేశి కరుణాకర్, చామకూరి శ్రీనివాస్‌లు యానం వెళ్లి సతీష్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.  సతీష్‌ నుంచి సుమారు 4లక్షల విలువగల బంగారు నగలను రికవరీ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్టు డీఎస్పీ తెలిపారు. 

మరిన్ని వార్తలు