కూటమికి అనుకూలంగా లగడపాటి జోస్యం

4 Dec, 2018 19:56 IST|Sakshi

ప్రస్తుత వాతావరణం కూటమికే అనుకూలంగా ఉంది 

నాలుగు జిల్లాల్లో కూటమి,మూడు జిల్లాల్లో టీఆర్‌ఎస్‌

సర్వే వివరాలు వెల్లడించిన లగడపాటి రాజగోపాల్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత వాతావరణం, ప్రజానాడి హస్తానికే మొగ్గు ఉందని కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేత లగడపాటి రాజగోపాల్‌ పేర్కొన్నారు. అక్టోబర్‌ 20 నుంచి దాదాపు 45 రోజులపాటు తమ ఫ్లాష్‌ టీం చేసిన సర్వేలో ఫలి తాలు ఆసక్తికరంగా రాబోతున్నాయని వెల్లడించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలవబోతున్నారని ఇటీవల ఆయన తిరుపతిలో చెప్పిన విషయం తెలిసిందే. అప్పుడు ఇద్దరు పేర్లు వెల్లడించిన లగడపాటి.. తాజాగా మరో ముగ్గురి పేర్లను బయటపెట్టారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, బెల్లంపల్లి నుంచి జి.వినోద్, మక్తల్‌ నుంచి జలంధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా గెలవబోతున్నారని చెప్పారు. 

పోలింగ్‌ శాతం తగ్గితే హంగ్‌...
అసెంబ్లీ ఎన్నికల్లో నమోదయ్యే ఓటింగ్‌ శాతాన్ని బట్టి విజయం ఎవరిదన్న అంశంపై స్పష్టత వస్తుందని లగడపాటి తెలిపారు. 2014 ఎన్నికల్లో 68.5శాతం ఓటింగ్‌ జరిగిందని, ఇంతకంటే ఎక్కువగా పోలింగ్‌ జరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్టు స్పష్టమవుతుందని, ఒకవేళ పోలింగ్‌ శాతం ఇంతకన్నా తగ్గితే హంగ్‌ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని వివరించారు. ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలు కూటమికి అనుకూలంగా ఉండగా.. వరంగల్, నిజామాబాద్, మెదక్‌ జిల్లాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. మహబూబ్‌నగర్, కరీంనగర్‌ జిల్లాల్లో కూటమి–టీఆర్‌ఎస్‌ల మధ్య గట్టి పోటీ ఉందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న 14 సీట్లలో మెజారిటీ సీట్లు ఎంఐఎం కైవసం చేసుకుంటుందని తెలిపారు.

ఈసారి బీజేపీకి గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని వెల్లడించారు. ఈ సర్వేల విషయంలో తాను ఏపీ సీఎం చంద్రబాబును గానీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గానీ కలవలేదని లగడపాటి స్పష్టంచేశారు. రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో వెయ్యి మంది నుంచి 1,200 మంది శాంపిల్స్‌ తీసుకున్నామని చెప్పారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు తెలంగాణ ఎన్నికల సర్వే పూర్తి ఫలితాలను 7వ తేదీ సాయంత్రం వెల్లడిస్తానని తెలిపారు. కాగా, తన సన్నిహితులైన ముగ్గురు నేతలు ఇండిపెండెంట్లు ఆధిక్యంలో ఉన్నచోట బరిలో ఉన్నందున ఆ వివరాలు ఇప్పుడే వెల్లడించలేనని లగడపాటి చెప్పడం గమనార్హం.

మరిన్ని వార్తలు