‘చెత్త’ చెరువు

20 Jan, 2018 18:30 IST|Sakshi
చెత్తతో నిండిన నల్లచెరువు

 రూ.5.41కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌ పనులు

డంపింగ్‌ యార్డును తలపించేలా నల్లచెరువు

ఫిర్యాదుచేసినా పట్టించుకోని మున్సిపాలిటీ అధికారులు

కలుషితమవుతున్న నీరు

అది పట్టణం నడిబొడ్డున ఉన్న చెరువు.. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది పట్టణవాసులకు ఆహ్లాద వాతావరణం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మినీ ట్యాంక్‌బండ్‌ పేరుతో రూ.5.41కోట్లు కేటాయించి సుందరీకరణ పనులు చేపట్టింది. ఆహ్లాదం దేవుడెరుగు! కానీ ప్రస్తుతం చెత్తాచెదారంతో చెత్త చెరువుగా మారిపోయింది. అటువైపు నుంచి వెళ్తే  దుర్గంధం వెదజల్లుతోంది.. ఇది నల్లచెరువు దైన్యం..!
   
వనపర్తి : జిల్లా కేంద్రంలో సుమారు 70ఎకరాల విస్తీర్ణంలో నల్లచెరువు విస్తరించి ఉంది. దీని కింద 397.37ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా టన్నుల కొద్దీ ధాన్యం పండుతుంది. మినీ ట్యాంకుబండ్‌గా మార్చిన తర్వాత కేఎల్‌ఐ నీటితో చెరువును నింపి ఏడాది పొడవునా కృష్ణాజలాలు ఉండేలా ఆధునికీకరణ కోసం అధికారులు ప్రణాళికలు రూపొందించి రూ.5.41కోట్లు వెచ్చించారు. కానీ నిత్యం వనపర్తి పట్టణం నుంచి సేకరిస్తున్న చెత్తను చెరువుకు ఉత్తరం, దక్షిణం దిశలో డంప్‌ చేస్తున్నారు. మినీ ట్యాంకు అభివృద్ధి పనులు ప్రారంభమైన రెండు నెలల క్రితం కొంతమేర చెత్త వేయగా ప్రస్తుతం పూర్తిగా నిండిపోయింది. నల్లచెరువును నీటితో నింపితే ఇక్కడ ఉన్న నీరంతా కలుషితమవడం ఖాయం. అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి సేకరించిన వ్యర్థాలను ఇక్కడే పారబోస్తున్నారు.

పట్టణవాసులకు ఆహ్లాదమైన వాతావరణం అందించేందుకు రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించి అభివృద్ధి చేస్తున్న మినీ ట్యాంకుబండ్‌లో చెత్త వేయడంతో పరిసరాలు కంపుకొడుతున్నాయి. చెరువు కట్టమీది నుంచి వచ్చేవారు ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది.
 
బోటుషికారుకు ఇబ్బందే    
మినీట్యాంకుబండ్‌లో చెత్త డంపింగ్‌ ఆపకుంటే మున్ముందు ఇక్కడ ఏర్పాటుచేసే బోటుషికారు మురుగు, కలుషితనీటిలో చేయాల్సిన వస్తుంది. ఒకవేళ పాడి ఆవులు, గేదెలు తాగినా పాల దిగుబడి తగ్గి, విషతుల్యం కానున్నాయి.  

బతుకమ్మల నిమజ్జనం కష్టమే..  
ఏటా దసరా సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించే బతుకమ్మలను నల్లచెరువులోనే నిమజ్జనం చేసే విధంగా అధికారులు ప్రత్యేక ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. చెరువు భూభాగంలో చెత్త డంపింగ్‌ ఆపకపోతే ఘాట్‌ నిర్మాణం పూర్తిగా చెత్తతో నిండిపోనుంది. ప్రతిష్టాత్మక బతుకమ్మ సంబరాలను చెత్తకుప్పల మధ్య నిర్వహించుకోవాల్సి వస్తోందని పలువురు పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త డంపింగ్‌ యార్డుకు ప్రతిపాదనలు
ఇంతకుముందు డంపింగ్‌యార్డు వివాదంలో ఉండడంతో కొత్తగా మరోచోట డంపింగ్‌ యార్డు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతి రాగానే డంపింగ్‌ ప్రదేశాన్ని మార్చుతాం. ప్రస్తుతానికి చెరువు ప్రదేశంలో చెత్త వేయకుండా మరోచోట వేసేలా చర్య తీసుకుంటాం.
వెంకటయ్య, ఇన్‌చార్జి కమిషనర్, వనపర్తి మున్సిపాలిటీ  
 

మరిన్ని వార్తలు