బీజేపీ అసెంబ్లీ ముట్టడి భగ్నం 

8 Nov, 2017 02:08 IST|Sakshi
అరెస్టయిన అనంతరం నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీజేపీ నేతలు కె.లక్ష్మణ్‌ తదితరులు

నాయకుల అరెస్ట్, పీఎస్‌కు తరలింపు 

హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం ఉదయం చలో అసెంబ్లీ కోసం బయలుదేరిన ప్రజాప్రతినిధులను బషీర్‌బాగ్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని నారాయణగూడ పీఎస్‌కు తరలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ప్రభాకరరావు, రాజాసింగ్‌లతో పాటు 86 మంది అరెస్ట్‌ అయిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. సామరస్యంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను పోలీసులు అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు.

నయా నిజాం సీఎం కేసీఆర్‌ 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ 
సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకోవడానికి శాంతియుత నిరసనలకు కూడా అవకాశం ఇవ్వకుండా నయా నిజాంలా సీఎం కేసీఆర్‌ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. పార్టీ నేతలు సంకినేని వెంకటేశ్వర్‌రావు, చింతా సాంబమూర్తి, జి.ప్రేమేందర్‌రెడ్డితో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఉద్యోగాల భర్తీ డిమాండ్‌తో చలో అసెంబ్లీ చేపట్టిన బీజేపీ, యువమోర్చా కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ దిష్టిబొమ్మలను బుధవారం దహనం చేయాలని లక్ష్మణ్‌ పిలుపిచ్చారు. ఈ నెల 26న ‘నిరుద్యోగ గర్జన’ పేరిట బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు