వరాల స్వామి.. జాగ లేదేమి..!

12 Mar, 2016 01:50 IST|Sakshi

దయనీయంగా కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి గుడి
గుట్ట తప్ప.. ఆలయం వద్ద సెంటు భూమి లేదు..
ఇబ్బంది పడుతున్న భక్తులు అభివృద్ధికి నోచుకోని ఆలయం
పట్టించుకోని ప్రభుత్వం

 
గీసుకొండ : వరాలిచ్చే దేవుడు.. భక్తుల కొంగు బంగారం ఆ స్వామి.. కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రతీతి.. అయితేనేం స్వామివారికి సెంటు భూమి కూడా లేదు. గుట్టపై కొలువుదీరడమే తప్ప దేవుడు కిందకు దిగే పరిస్థితి లేదు.. ఎందుకంటే గుట్ట మినహా దిగువన కాలు మోపడానికి స్వామివారికి సెంటు భూమి కూడా లేదు. ఇదీ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పరిస్థితి. స్వామివారు కొలువుదీరిన కొమ్మాల గుట్ట దిగువన ప్రభుత్వ, దేవస్థాన భూమి లేకపోవడంతో వందల ఏళ్ల నాటి ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. టూరిజం శాఖ నుంచి రూ.1.75 కోట్లు మంజూరు కాగా, ఆ నిధులతో గుట్ట దిగువన పిల్లల పార్కు, ప్రహరీ, మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించాల్సి ఉంది. అయితే స్థలం లేకపోవడంతో వీటిని నిర్మించలేదు. ఇటీవల టూరిజం శాఖ జీఏం నర్సింహరావు, రామకృష్ణతో పాటు జిల్లా టూరిజం అధికారి శివాజీ ఈ ఆలయాన్ని సందర్శించి స్థల పరిశీలన చేశారు. అయితే ఇక్కడ సెంటు భూమి కూడా ఆలయానికి లేదని స్థానికులు చెప్పడంతో వారు వెను దిరిగారు. గుట్ట చుట్టూ రైతుల పంట చేలు, మరికొందరు తమ పొలాలను ప్లాట్లుగా చేసి అమ్ముతుండడంతో ఆలయూభివృద్ధికి అవసరమైన స్థలం ఎవరూ ఇవ్వడం లేదు.
 
భూమి ఇవ్వమంటున్న అర్చకులు..
 ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలకు ఇక్కడ సుమారు 12 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ నెల 1న జాతర ఏర్పాట్ల గురించి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధికారులు, అర్చకులతో సమీక్ష నిర్వహించారు. ఆలయానికి భూమి లేకపోతే అభివృద్ధి పనులు ఎలా చేస్తామని ఎమ్మెల్యే గట్టిగానే వాదించారు. కనీసం రెండెకరాల స్థలం ఇస్తే అందులో నిర్మాణాలు చేపట్టవచ్చునని సూచించారు. అయితే తాము రెండెకరాల స్థల ం ఇస్తామని, కానీ మిగిలిన  పదెకరాలు కూడా ఎకరానికి రూ.20 లక్షల చొప్పున కొనుగోలు చేయాలని వారు షరతు పెడుతున్నారు. ఈ విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కాగా, గుట్ట పాదం వద్ద సర్వే చేయిస్తే సుమారు 800 గజాల స్థలం తేలుతుందని, అందులో నిర్మాణాలు చేపట్టవచ్చని ఆలయ అధికారులు అంటున్నారు. స్వామి వారి పేరిట దస్రునాయక్ తండా శివారులో నాలుగెకరాలు, విశ్వనాథపురంలో 2.39 గుంటల భూమి ఉంది. ఇందులో వరంగల్-నర్సంపేట రహదారి పక్కనున్న 4 ఎకరాలు అమ్మి ఆ డబ్బుతో గుట్ట వద్ద కొనుగోలు చేయవచ్చని పలువురు అంటున్నారు.
 
జాతర ఆదాయమే ఆధారం..
 కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ప్రతి ఏడాది హోలీ పండుగ నుంచి వారం రోజుల పాటు జరిగే జాతర ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన వనరు. ఇవే కాకుండా వివాహాలు, అర్చనలు, ప్రత్యేక పూజల పేరుతో కూడా కొంత ఆదాయం వస్తోంది. 2014-15లో ఆలయానికి రూ. 32.99 లక్షల ఆదాయం రాగా.. ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులకు మొత్తం రూ. 30.94 లక్షలు ఖర్చు అయిందని ఆలయ ఉద్యోగులు చెబుతున్నారు. వచ్చిన ఆదాయం మొత్తం ఖర్చులకే పోతుండడంతో ఆలయం అభివృద్ధికి, భూమి కొనుగోలుకు నిధులు మిగలడం లేదు. ఇప్పటి వరకు దాతల సాయంతోనే పలు ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఆలయం అభివృద్ధి చెందటం లేదు.
 
ఆలస్యంగా పనులు..

స్వామివారి గుట్టపై వాటర్ ట్యాంకు నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహ న్ రావు రూ. 20 లక్షలు కేటాయించగా పనులు చేపట్టలేదు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతో ఇటీవల  పనులు ప్రారంభించారు. కొమ్మా ల  నుంచి ఆలయం వరకు వేసిన రోడ్డు కంకర తేలి ఉంది. దీన్ని బీటీగా మా ర్చడానికి రూ. 20 లక్షలు అవసరం. పనులు చేసేవారు లేక ఇదీ పెండింగ్‌లోనే ఉంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈనెల 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ లోగా ట్యాంకు, రోడ్డు పనులు పూర్తి కాక  భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు.   
 
స్వామివారి సొమ్ము ఫలహారం..!  
 2008లో జాతరలో కొబ్బరి కాయలు అమ్ముకోవడానికి వేలం పాట పాడిన ఓరుగంటి సురేశ్ రూ. 30,300 చెల్లించలేదు. 2012లో కొబ్బరి కాయలు అమ్ముకున్న హాలావత్ నర్సింహ రూ. 24 వేలు, 2015లో కత్తి దస్తగిరి కొబ్బరి కాయలు అమ్ముకుని రూ. 95 వేలు చెల్లించలేదు. 2011-12లో భూమి కౌలు దారుడు మూడు లాలునాయక్ రూ. 92 వేలు, హలావత్ సర్సింహ రూ. 21 వేలు చెల్లించాల్సి ఉంది. వీటిని సదరు వ్యక్తులు చెల్లించకపోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల కొం దరు గీసుకొండ సీఐకి ఫిర్యాదు చేశారు.
 

మరిన్ని వార్తలు